indiGo | దేశంలో అతిపెద్ద విమానసంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం తొలిసారిగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సేవలు ప్రభావితమయ్యాయి. పెద్ద ఎత్తున విమానాలు రద్దుకావడం, రీషెడ్యూల్ కావడంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విమానయాన మంత్రిత్వశాఖ విమానాల్లో కోతలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా డీజీసీఏ (DGCA) సమన్లు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోగా సేవల అంతరాయంపై సమగ్ర డేటా, అప్డేట్స్ను అందించాలని ఇండిగో సీఈవోను ఆదేశించింది. ఇండిగో సంక్షోభం బుధవారం సైతం కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ విమానాలను రద్దయ్యాయి. బెంగళూరులో 61 విమానాలు రద్దయ్యాయి.
అయితే, మంగళవారం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ విమానాయన సేవలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయని.. గతంలోనే విమానాలను రాకపోకలు సాగిస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అన్ని విభౠగాల సీనియర్ అధికారులతో సమావేశానికి హాజరుకావాలని సీఈవోను ఆదేశించినట్లు డీసీజీఏ వెల్లడించింది. విమానాల సేవలు పునః ప్రారంభం, పైలట్స్, సిబ్బంది రిక్రూట్మెంట్ ప్లాన్, రద్దయిన విమానాల సంఖ్య, ఇప్పటి వరకు చెల్లించిన రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 విమానాలను నడుపుతున్నది. ఏవియేషన్ మార్కెట్లో ఇండిగోకు 60శాతం కంటే ఎక్కువ వాటా ఉన్నది. సంక్షోభం కారణంగా మార్కెట్ క్యాప్ సుమారు రూ.21వేల కోట్లు పతనమైంది. ఓ వైపు పరిస్థితి మెరుగుపడిందని ఎయిర్‌లైన్స్ చెబుతున్నా.. దేశవ్యాప్తంగా ఇంకా విమానాల రద్దు కొనసాగుతూనే ఉన్నది.
దేశవ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా నసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణం డిసెంబర్ ఒకటి నుంచి ఇండిగో వేల సంఖ్యలో విమానాలను రద్దు చేయడమే. డీజీసీఏ జారీ చేసిన కొత్త భద్రతా నియమాల మేరకు.. ఎయిర్ లైన్స్ సరైన ప్రణాళికలను రూపొందించడంలో విఫలమైంది. దాంతో కార్యకలాపాలో గందరగోళానికి దారి తీసింది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకాగా.. ఇదే అదునుగా పోటీ విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన కేంద్రం చార్జీలను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో డీజీసీఏ ఇండిగో శీతాకాలం విమానాల షెడ్యూల్లో పదిశాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో 220 విమానాలు తగ్గనున్నాయి. అయితే, మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇండిగో కార్యకలాపాలను స్థిరీకరించడానికి, రద్దయిన విమానాల సంఖ్యను తగ్గించేందుకు ఈ చర్యలు అవసరమని చెప్పుకొచ్చారు.