న్యూఢిల్లీ, మార్చి 16: రూ.500 లంచం తీసుకున్నాడన్న కేసులో దోషిగా తేలిన ఓ మాజీ కానిస్టేబుల్‌కు 36 ఏండ్ల తర్వాత శిక్ష ఖరారైంది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ముంగిటకు రాగా, హైకోర్టు తీర్పును సమర్థించింది. కాకపోతే.. సదరు మాజీ కానిస్టేబుల్ వయసు 75 ఏండ్లకు చేరుకోవటం, ఇప్పటికే రెండు నెలలు జైల్లో శిక్షను అనుభవించటాన్ని పరిగణనలోకి తీసుకొని.. శిక్షను ఏడాదికి తగ్గించింది. కింది కోర్టుల తీర్పులో ఎలాంటి లోపం లేదని పేర్కొన్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్‌పై 1990లో కోర్టు విచారణ మొదలుకాగా, 2006లో సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లగా, పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో 2012లో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు. 2013 నుంచి అతడు బెయిల్‌పై బయట ఉంటున్నాడు.