రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చెప్పాలి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి..దేనికవే ప్రత్యేకం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయం పాతుకుపోయి ఉన్నది. అస్సాం, పుదుచ్చేరిలో తప్ప మిగతా మూడు రాష్ర్టాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. నిజానికి బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకొనే పార్టీలు అధికారంలో ఉన్నాయనడం సరిపోతుంది. అందుకే బీజేపీ ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నిమార్గాలనూ వెదుకుతున్నది. ఆ మూడు రాష్ర్టాలూ అస్తిత్వ సమస్యగా మారిపోయాయి కమల దళానికి. మరోవైపు కాంగ్రెస్కు ఆ మూడు రాష్ర్టాల్లో ఉన్న సొంత పలుకుబడి చాలా తక్కువ. మిత్రపక్షాల మద్దతుతో ఉనికి చాటుకోవాలని వృద్ధ పార్టీ చూస్తున్నది. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి కుదించుకుపోయిన కమ్యూనిస్టు పార్టీ ఆ మూడు రాష్ర్టాల్లో హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి.
గత పన్నెండేండ్లుగా కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష లాంటివి. తమిళనాడులో అడుగు మోపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న కమలం పార్టీ ఈసారి నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీతో పొత్తు పెట్టుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నది. అన్నాడీఎంకే ప్రాభవం తగ్గిపోయిన తరుణంలో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు డీఎంకే వ్యూహాలు రచిస్తున్నది. ద్రవిడ పార్టీల దాగుడుమూతలకు ఆలవాలమైన తమిళనాడులో అడుగు మోపేందుకు అవకాశం దొరికినా చాలనుకుంటున్నది. ద్రవిడ రాజకీయం అందుకు వీలు కల్పిస్తుందా అనేది ప్రశ్న. ఇక పశ్చిమబెంగాల్ పజిల్ బీజేపీకి కొరకరాని కొయ్యగానే ఉన్నది. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి వరుసగా మూడుసార్లు అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకున్న మమతా దీదీని ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. కేంద్రంలోని బీజేపీతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘంపైనా దీదీ భీకర పోరాటం జరుపుతున్నారు. ఈ పోరాటం ఇటు వీధుల్లోనూ, అటు న్యాయస్థానాల్లోనూ ఏకకాలంలో కొనసాగుతున్నది. అస్సాంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ కొంచెం ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. రెండు విడతలు పరిపాలన సాగించిన బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటమే అందుకు కారణం. ఇపుడు ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. దేశంలో కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళలో ఇటీవలే బీజేపీ తిరువనంతపురం మహానగర పాలక సంస్థను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మూడు మతాల ముచ్చటైన కూడలి లాంటి విద్యాధిక రాష్ట్రంలో బీజేపీ అంతకుమించి ఎదిగే అవకాశాలు ఉంటాయా అనేది అప్పుడే చెప్పలేం.
ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన సంకీర్ణంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ ఈసారి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నది. ఈ ఐదు చోట్లా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీకి ఏకైక ప్రచారకర్తగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంత మెజారిటీకి దూరం కావడం వల్ల ఆయన ధాటి తగ్గింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా రాష్ర్టాల్లో సాధించిన విజయాలతో కొంత ఊరడిల్లారు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఈసరికే బీజేపీని ఇరుకున పడేశాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ విధానాల వైఫల్యం, ఇంటింటా వంటగ్యాస్ సమస్యగా పరిణమించడం వంటి పరిణామాలు కమలం పార్టీకి గుదిబండగా మారే ప్రమాదమున్నది. అంతిమంగా ఈ ఐదు రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు రేపటి రాజకీయానికి మూలమలుపుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.