బచ్చన్నపేట, ఆక్టోబర్ 13 : గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్చర్ల, పోచన్నపేట, నారాయణపూర్, కొడవటూరు, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పామని, వాటిని ప్రతిరోజూ తానే పర్యవేక్షించానన్నారు.
ఎన్ని కేంద్రాలు ప్రారంభమయ్యాయి? ఎ న్ని వడ్లు వచ్చాయి? అనే విషయాలను తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేవాడినన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంజాబ్‌కు తరలించేవారమని, అక్కడ ఒకసారి మాత్రమే వరి పండిస్తారని, రెండో పంటగా గోధుమలు సాగుచేస్తారన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపాలని, అప్పుడే భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సన్నాలతో పాటు దొడ్డు వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలన్నా రు. గతంలో కూడా సన్న వడ్లకు బోనస్ సక్రమంగా అందలేదన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, 24 గంటల కరెంటు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రాల్లో తరుగు లేకుండా ధాన్యం తీసుకోవాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని, రైతు తెచ్చిన ధాన్యాన్ని ఒకే రోజులో కొనుగోలు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీవో మమతాబాయ్, ఏపీఎం రవి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, నాయకులు కొండి వెంకట్‌రెడ్డి, పూర్ణచందర్, మల్లారెడ్డి, మద్దికుంట రాధ, షబ్బీర్, కనకయ్య గౌడ్‌తో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.