నిజామాబాద్, అక్టోబర్ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గడిచిన యాసంగి సీజన్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదు. ఐదు నెలలు పూర్తవుతున్నప్పటికీ చడీచప్పుడు లేదు. ఈ విషయంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూటకో మాటలు మాట్లాడుతూ తప్పించుకుంటున్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి వెనుకాడుతున్నారు. రైతులకు ప్రతి సీజన్లో పండించిన ప్రతి పంటకు రూ.500 చొప్పున బోనస్ అమలు చేస్తామని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటిచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు ఎగనామం పెట్టి సన్నవడ్లకే చెల్లిస్తామని మెళిక పెట్టారు. బోనస్ వస్తుందనే ఆశతో రైతన్నలంతా దొడ్డు వడ్లకు దండం పెట్టి సన్న వడ్లను సాగు చేశారు. భారీ ఎత్తున సన్న వడ్లు ఉత్పత్తి పెరిగింది. గత యాసంగి సీజన్లో సన్న వడ్లను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నెలల తరబడి పెండింగ్ లో పెట్టి జమ చేసింది. బోనస్ డబ్బులు త్వరలోనే వేస్తామంటూ బుకాయించి నెలలు గడుస్తున్నప్పటికీ అతీగతీ లేదు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు షురూ అవుతున్నప్పటికీ యా సంగిలో సేకరించిన సన్న వడ్లకు బోనస్ ఊసే కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడుతుండగా రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
యాసంగి సీజన్ 2024-25 లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇచ్చిన మాటను అమలు చేసేందుకు కొర్రీలు పెడుతూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నిర్ణీత గడువులోగా బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉండగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. బోనస్‌పై మంత్రులు పూటకొకరు నోటికొచ్చినట్లుగా ప్రకటనలు గుప్పించారు. వారి మాటలకు విలువే లేకుండా పోయింది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావులతో పాటుగా ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాయమాటలు చెప్పారు. త్వరితగతిన బోనస్ చెల్లింపులుంటాయంటూ రైతులను మభ్యపెట్టడానికే పరిమితం అవుతున్నారు. ఇంత వరకూ పైసా విడుదల కాకపోవడంపై నోరు విప్పడం లేదు. బోనస్ చెల్లింపుల చేసేందుకు తాత్సారం చేస్తోన్న రైతు లోకానికి బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు క్షమాపణలు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
యాసంగిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ఘనంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనే ఉండటం లేదు. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 7లక్షల 15వేల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించారు. వీటికి మొత్తం రూ.360కోట్లు మేర బోనస్ రూపంలో రైతులకు చెల్లించాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 1లక్ష 77వేల మెట్రిక్ టన్నులు సన్న రకం వడ్లను యంత్రాంగం కొనుగోలు చేసింది.
వీటికి బోనస్ రూపంలో రూ.89కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పైసా నిధులు విడుదల చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం రూ.449 కోట్లు మేర బోనస్ చెల్లింపులు పేరుకు పోయాయి. ఐదు నెలలు కావొస్తున్నప్పటికీ రూపాయి ఇవ్వడం లేదు. రైతులకు బాకీ పడ్డ బోనస్‌ను చెల్లించేందుకు వెనుకాడుతుండటంపై ప్రభుత్వాన్ని రైతులు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. హామీలిచ్చి మోసం చేయడం సరికాదంటున్నారు. వరి పంట సాగులో అనేక ఇబ్బందులు పడ్డ రైతులకు బోనస్‌తో సాంత్వన దొరుకుతుందని అన్నదాతలు ఆశ పడుతున్నారు. కానీ రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఇస్తామని చెప్పిన క్వింటాలుకు రూ.500 చెల్లించకపోవడంతో సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తామని రైతులకు ఆశ పెట్టడంతో దొడ్డు రకానికి బదులుగా సన్నరకం వరి పంట సాగు చేశాం. కానీ ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇప్పటి వరకు దిక్కు లేదు. అసలు బోనస్ ఇస్తారో.. ఇవ్వరో కూడా తెలియడం లేదు. రైతుల పరిస్థితి ఆగమ్యగోచ రంగా ఉంది. బోనస్ కన్నా ముందు రైతుల ప రిస్థితి బాగుండేది. దొడ్డు రకం వడ్లు పండించేవాళ్లం. బాగా దిగుబడులు వచ్చేవి. పంట పె ట్టుబడి కూడా చాలా తక్కువ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌పై ఆశపడి రెండింతలు బాగా నష్టపోయాం.
– పల్లెంపాటి శ్రీనివాసరావు (వాసుబాబు) రైతు, కోటగిరి
దొడ్డు రకం వడ్లు పండించినప్పుడు బాగుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఆశ చూపడంతో దొడ్డు రకం వడ్లు వేయడం మానేసి సన్నాలు వేశాను. కానీ ఇప్పటి వరకు బోనస్ ఊసేలేదు. గత సీజన్లో బోనస్ ఇవ్వలేదు. మళ్లీ ఈ సీజన్లో కోతలు ఆవుతున్న ఇప్పటివరకూ బోనస్ మాటే లేదు.దొడ్డు రకం వడ్లు వేసినట్లు రూ.4 లక్షల పంట పండింది. సన్నాలు వేశాక 3లక్షలు మాత్రమే పంట పండింది. ఇలా లక్ష రూపాయలు నష్టపోవడమే కాకుండా బోనస్ ఆశతో చాలా కౌలు ధరలు పెరిగాయి. ఈసారి అధిక వర్షాలకు పంట దిగుబడి తగ్గింది. రైతులకు చాలా నష్టం వాటిల్లింది.
– గాండ్ల రమేశ్, రైతు, కోటగిరి
రైతులకు ఇస్తామన్న బోనస్ సకాలంలో చెల్లించకుంటే రైతుల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తాం. గత సీజన్లో బోనస్ ఇస్తామని సర్కారు చెప్పడంతో సన్నరకం వడ్లు పండించాం. ఈ సీజన్లో కూడా వరి కోతలు జరుగుతున్నా ఇప్నటి వరకు ప్రభుత్వం బోనస్ ఊసే ఎత్తడం లేదు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత అలుసా..?బోనస్ ఆశతో రైతులకు బాగా నష్టం జరిగింది. సన్నాలకు పెట్టుబడులు.. మరోపక్క తెగుళ్లు ఆశించడం.. పంట దిగుబడులు తగ్గడం, మరో పక్క పంటకు ధర లేకపోవడం వల్ల బాగా నష్టం వాటిల్లింది.
-రమణ, రైతు, కోటగిరి
కోటగిరి, అక్టోబర్ 13: సన్నవడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో దొడ్డు రకం వడ్లు సాగు చేయడం మానేసి సన్నాలు పండించాం. ఎంతో కష్టపడి.. పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాం. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం అమ్మినం. కానీ యాసంగిలో పంటకు బోనస్ ఇంతవరకూ చెల్లించలేదు. మళ్లీ ఈ వానకాలం సీజన్లో కూడా బోనస్ మాటనే లేదు. ఇస్తారో.. ఇవ్వరో కూడా స్పష్టత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది.
-గాండ్ల సత్యం, రైతు, కోటగిరి