రంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర్నగర్, శంషాబాద్ డివిజన్లు ఉండగా.. 249 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది జరిపిన టెండర్ల ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చింది. కాని, ఈసారి గత సంవత్సరం వచ్చిన దాంట్లో 25 శాతం కూడా ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఆబ్కారీ అధికారులు మద్యం టెండర్లదారుల కోసం ఎదురుచూస్తున్నారు. సరూర్నగర్ డివిజన్ పరిధిలో ఉన్న 138 మద్యం షాపులకు గత సంవత్సరం 10,661 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 376 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అలాగే, శంషాబాద్ డివిజన్ పరిధిలోని 111 వైన్ షాపులకు గత సంవత్సరం 10వేలకు పైగా దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 877 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
గత సంవత్సరం టెండర్లతో జిల్లా నుంచి సర్కారుకు రూ.432 కోట్ల ఆదాయం లభించగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చిన టెండర్ల ద్వారా 37.56 కోట్లు మాత్రమే వచ్చింది. శంషాబాద్ డివిజన్లో 111 మద్యం షాపులుండగా.. శంషాబాద్లో 40, శేరిలింగంపల్లిలో 44, చేవెళ్ల డివిజన్ పరిధిలో 27 ఉన్నాయి. సరూర్నగర్ డివిజన్ పరిధిలో 138 మద్యం షాపులుండగా.. సరూర్నగర్లో 32, హయత్నగర్లో 28, ఇబ్రహీంపట్నంలో 19, మహేశ్వరంలో 14, ఆమనగల్లులో 17, షాద్నగర్లో 28 మద్యం షాపులున్నాయి.
తగ్గిన రియల్ ప్రభావం.. దరఖాస్తు ఫీజు పెంపుతో వెనుకంజ
జిల్లాలోని వైన్స్ షాపులకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పోటీ ఉండేది. కాని, ఈ ఏడాది టెండర్లకు దరఖాస్తులు వేయడానికే వ్యాపారస్తులు ముందుకు రావటంలేదు. ముఖ్యంగా జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడం కూడా ఒక కారణమైంది. ముఖ్యంగా జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్, కడ్తాల్, ఆమనగల్లు, చేవెళ్ల వంటి మండలాల్లో గతంలో రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉండేది. కాలక్రమేణా తగ్గిన రియల్ ఎస్టేట్ ప్రభావంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్యం టెండర్లకు దూరంగా ఉన్నారు. మరోవైపు మద్యం టెండర్ల కోసం గతంలో రూ.2లక్షలు మాత్రమే చెల్లించి పాల్గొనేవారు. కాని, ఈ ఏడాది అదనంగా మరో లక్ష పెంచి రూ.3లక్షలకు పెంచింది. ఈ పెంపు ప్రభావం కూడా టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రావడంలేదని అధికారులు భావిస్తున్నారు.
నాలుగు రోజులపైనే అధికారుల ఆశలు
మద్యం టెండర్ల దాఖలు కోసం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ నాలుగు రోజులే కీలకం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో పెద్దమొత్తంలో దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా నగర శివారుల్లోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, సరూర్నగర్ వంటి ప్రాంతాల్లోని వైన్స్ షాపులకు టెండర్లు వేసేవారు కూడా ఈ ఏడాది ముందుకు రాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.