ఐనవోలు (హనుమకొండ): ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్ల ఎంపిక ప్రక్రియకు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా ఐనవోలు పోలీసు స్టేషన్‌ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఎ) ఎవాల్యూయేషన్ ఆఫీసర్ సయ్యద్ మహ్మద్ హసన్ సోమవారం సందర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో ప్రతి ఏటా ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రక్రియ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను ఆన్లైన్ రికార్డుల నమోదు ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేసే విషయం తెలిసిందే. దేశంవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో 78 పోలీసు స్టేషన్లను ఎంపిక చేయగా తెలంగాణలో రాష్ట్రం నుంచి ఎంపికైన మూడు పోలీస్ స్టేషన్లలో ఐనవోలు ఒక్కటి.
78 పోలీసు స్టేషన్లలో టాప్-10లోకి రావడానికి ఆ శాఖ ప్రామాణాలకు తగిన విధంగా తీర్చిదిద్దడం కోసం ఐనవోలు ఎస్ఐ పస్తం శ్రీనివాస్, సీఐ పర్వతగిరి రాజగోపాల్ ఉన్నతాధికారుల సహకారంతో కృషి చేశారు. స్టేషన్‌ని క్షేత్రస్థాయిలో సందర్శించిన ఎంహెచ్ఎ అధికారి ఆ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ప్రకారం పలు ప్రశ్నలు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ ర్యాంకింగ్ కోసం 19 పారామితులను పరిశీలించారు. ఇందులో 80 శాతం మేరకు ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు మైనర్ చట్టాల పరిధిలో కేసులు, మహిళ చట్టాల పరిధిలో కేసులు, రోడ్డు భద్రతా చర్యలు, రికార్డుల నిర్వహణ, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలు, డిజిటల్ సేవల వినయోగంపై అవగాహన, ప్రజల స్పందన తదితర అంశాలను పరిగణలోకి తీసుకోగా 20 శాతం మౌలిక వసతుల కల్పనతోపాటు పరిసరాల పరిశుభ్రత, ఫిర్యాదుదారులతో పోలీసు ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్నారు. ఏడాది కాలంలో డయల్ 100 కాల్స్ 1207 రాగా సగటున 4.08 నిమిషాల్లో స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నట్లుగా గుర్తించారు.
840 సన్నిహిత పిటిషన్లు రాగా 288 కేసు నమోదు చేశారు. అన్ని విభాగాల్లో పోలీసు స్టేషన్ డిపార్టుమెంట్ నిబంధనల ప్రకారం 99..శాతం కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఇలా అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో హసన్ మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (కేంద్ర మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్తమ పోలీసు స్టేషన్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా 78 పోలీసు స్టేషన్లలో రాష్ట్రంలో నుంచి వచ్చిన మూడు పోలీసు స్టేషన్లలో ఐనవోలు ఉందని తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్నట్లుగా వివరించారు. పోలీసు సిబ్బంది పనితీరు, నిర్వహణ పబ్లిక్ రిలేషన్, మౌలిక వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా గుర్తించిన పోలీసు స్టేషన్ ర్యాంకింగ్స్‌ను నవంబర్, డిసెంబర్ నెలలో ఉత్తమ టాప్-10 పోలీస్ స్టేషన్లను ప్రకటిస్తారన్నారు. అవార్డుతో పాటు, ప్రశంసా పత్రాలను అందిస్తారని వివరించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీసీ ఆంకిత్ కుమార్, మామునూర్ ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, స్థానిక ఎస్ఐ పస్తం శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.