సూర్యాపేట టౌన్, పిబ్రవరి 28 : డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకమని డ్రైవర్లకు చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్ధవంతంగా నడపగలరని ఎస్పీ కె.నర్సింహ పేర్కొన్నారు. ఎరైవ్ ఎలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవర్లకు శనివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టతరమైన డ్రైవింగ్ వృత్తిని ఎంచుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా డ్రైవర్లు నిర్విరామంగా కష్టపడుతుంటారన్నారు.
వయస్సు పెరిగే కొద్ది కంటిచూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంటిచూపు స్పష్టంగా ఉంటేనే సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలుగుతారని అన్నారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపును ఆశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక లయన్స్ క్లబ్ వైద్యులు, గ్లోబల్ కంటి దవాఖాన డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు.
ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన, పాటించాల్సిన నియమాలను వివరించారు. శిబిరంలో 500ల మందికి పైగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, నరసింహరావు, నాగేశ్వర్రావు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ ఎస్సై సాయిరాం, ఎంవీఐలు సంపత్, సతీష్‌కుమార్, కంటి వైద్యులు రంజిత్‌కుమార్, స్వాతి, గ్లోబల్ దవాఖాన యాజమాన్యం క్రాంతి, భిక్షపతి తదితరులు ఉన్నారు.