Koratala Siva | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య.. మరోవైపు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ‘NBK111 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉండగా, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్య పూర్తిస్థాయిలో కొరటాల శివ దర్శకత్వంలోని కొత్త చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే అమరావతిలో ఈ ప్రాజెక్ట్‌కు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదట ఈ సినిమాను ఆగస్టు మూడో వారంలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. అయితే ఇటీవల బాలకృష్ణ మోకాలికి చిన్నపాటి శస్త్రచికిత్స జరగడంతో, వైద్యుల సూచన మేరకు ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.తాజా సమాచారం ప్రకారం బాలయ్య పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మొదట హీరో లేని సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌ను మార్చి, బాలకృష్ణ పాల్గొనే పవర్ఫుల్ మాస్ ఎంట్రీ సన్నివేశాలతోనే తొలి షెడ్యూల్‌ను ప్రారంభించాలని నిర్ణయించారట. కొరటాల శివ స్టైల్లో యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. కమర్షియల్ మాస్ అంశాలతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలు కూడా సినిమాలో ప్రధాన బలంగా ఉండనున్నాయి. ఇక ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె హీరోయిన్గా కాకుండా, నెగెటివ్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన పాత్రలో కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ-ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.