వేసవి ఇంకా రాక ముందే.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎక్కడికైనా విహారానికి వెళ్దామంటే ఎండలు అప్పుడే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎండలకు గొడుగు పట్టే కొడుగుకు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. పచ్చదనంతో మురిసిపోయే పర్వతాలు.. కొండల్లో, కోనల్లో ఉరకలేసే కావేరి నదీ జలాలు.. చూపరులకు ఆనందాన్నిస్తాయి. అన్నిటినీ మించి వేసవి తాపానికి చల్లని విరుగుడు కర్ణాటకలోని కొడుగు. పేరు కొత్తగా ఉందా..! కూర్గ్గా ప్రాచుర్యం పొందిన వేసవి విడిది ఇదే! పడమటి కనుమల్లో నాలుగున్నర వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 900 నుంచి 1750 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
కొడుగు జిల్లా ప్రధాన కేంద్రం మడికెరి. మండు వేసవిలోనూ ఇక్కడ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే నమోదవుతుంటాయి. అందుకే కూర్గ్ను ఇండియన్ స్కాట్లాండ్గా అభివర్ణిస్తుంటారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎంచక్కా నాలుగు రోజులు హాయిగా గడిపేయొచ్చు. ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశాలు మాత్రమే కాదు.. పిల్లలను మెప్పించే జలపాతాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఇలా ఎన్నో ఉన్నాయిక్కడ. బెంగళూరు, మైసూర్వాసులు వారాంతాల్లో చలో కూర్గ్ అనేస్తారు. మడికెరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెండు రోజుల్లో చుట్టేసి వస్తుంటారు.
చూడాల్సినవి: అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం, చలవార జలపాతం, మల్లాలి జలపాతం, వల్నూర్ ఫిషింగ్ క్యాంప్, మడికెరి కోట, సుండికొప్ప (కాఫీ, తేయాకు తోటలకు ప్రసిద్ధి), తలకావేరి (కావేరి నది జన్మస్థానం), భాగమండల త్రివేణి సంగమం (కావేరి, కన్నికె నదులు, అంతర్వాహిని సుజ్యోతి), దుబార ఏనుగుల సంరక్షణ కేంద్రం, పుష్పగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బ్రహ్మగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
చేరుకునేదిలా: మడికెరి… మైసూర్ నుంచి 118 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో మడికెరి వెళ్లొచ్చు. అక్కడ స్థానికంగా ట్యాక్సీలను మాట్లాడుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టేయొచ్చు.