మెదక్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) :న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని …కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తోందని, ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పిన మాటే నిజమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఘోష్ కమిషన్ రిపోర్టును న్యాయస్థానమే తప్పుపట్టిందని, దీని ఆధారంగా కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని, ఈ రిపోర్టు సరిగ్గా లేదని న్యాయ స్థానమే చె ప్పిందని తెలిపారు. భవిష్యత్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, సీబీఐకి నివేదించినా, తెలంగాణ ప్రజలకోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలాగా కట్టిన కేసీఆర్ విజయంతో ముందుకు వస్తారని, కాంగ్రెస్ కుట్రలను ఛేదిస్తారని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రితో చేతులు కలిపి, బనకచర్లకు నీటిని తరలించేందుకు కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డను సాకుగా చూపెట్టి, తెలంగాణను ఏడారి చేయడానికి కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని, కేసీఆర్, హరీశ్‌రావు ఘోష్కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, వాటిని ఛేదించుకుని నిప్పులాగా వారిద్దరూ నిలబడతారని, తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నాం
పార్టీ క్రమ శిక్షణ చర్యలకు పాల్పడినందుకు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని కేసీఆర్ సందేశాన్ని పంపించారన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది జీవన్‌రావు, పట్టణ పార్టీ కో కన్వీనర్ కృష్ణాగౌడ్, లింగారెడ్డి, హవేళిఘనపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నగేశ్, రవి, వేణు, ఎంబీపూర్ మహేశ్ పాల్గొన్నారు.
కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నాం
దుబ్బాక, సెప్టెంబర్ 2: ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై మంగళవారం ఆయన స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటే తమకు శిరోధార్యమన్నారు. కేసీఆర్ తీసుకున్న ఏనిర్ణయమైన బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు శ్రేయస్కరమన్నారు. కొంత కాలంగా ఎమ్మెల్సీ కవిత క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాకుండా పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరించిందన్నారు. సొంత కూతురైన కవితను సస్పెండ్ బచేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
తెలంగాణ సాధించుకుని, బంగారు తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించిందన్నారు. ఇదంతా కేసీఆర్ ప్రత్యేక పోరాట ఫలితమేనని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు. పార్టీకి ఇబ్బందులు కలిగించినా, నష్టం చేసినా చర్యలు తప్పవని కేసీఆర్ గుర్తు చేశారన్నారు. పార్టీకి ద్రోహం చేసే వారికి స్థానం ఉండదన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి స్వాగతిస్తున్నామని తెలిపారు.