KTR | కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు ఏండ్ల ముందే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ భయంకరంగా విషం చిమ్మిందని మండిపడ్డారు. అడ్డమైన అబద్ధాలతో ప్రాజెక్టును బద్నాం చేసి ప్రజలకు లేనిపోని అనుమానాలను కలిగించిందని.. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవే విమర్శలు, ఆరోపణలు కొనసాగిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ జేబు సంస్థలని విమర్శిస్తారని.. రూ.కోట్లు గంగలో కలిపి 22 నెలలు టైం పాస్ చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నట్టుగా ఘోష్ కమిషన్‌తో ఏం సాధించలేకపోయారన్నారు.
రాహుల్ గాంధీ అనునిత్యం విమర్శించే సీబీఐతోని కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లను తీసుకొచ్చి మూసీకి పునర్ వైభవాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనంతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని.. సరిగ్గా వారం కింద కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారన్నారు. కాళేశ్వరం, కూలేశ్వరం అని వాగిన నోటితోనే ఇవాళ అవే కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్‌కు తీసుకొస్తా అని చెబుతున్నాడని.. మేం చెప్పినట్టుగానే కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, కామధేనువు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒప్పుకుందన్నారు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తరలించే పథకానికి శంకుస్థాపన, మొన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తీసుకువచ్చే పనులకు శంకుస్థాపన అని.. కానీ తెల్లారి లేస్తే కాళేశ్వరం మీద అవాకులు, చెవాకులు, శాపనార్థాలు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో లేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటూనే దాన్ని బద్నాం చేస్తున్న ముఖ్యమంత్రి వైఖరి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఉందని ధ్వజమెత్తారు కేటీఆర్. గండిపేటకు తీసుకు వస్తున్నది కాళేశ్వరం నీళ్లా? కాదా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు, దానిమీద కమిషన్ వేసి అట్టర్ ప్లాప్ అయినందుకు, మళ్లీ సీబీఐ విచారణ పేరుతో మోసం చేస్తున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా చిత్రీకరించడని.. కానీ, రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు ఒక రిజర్వాయర్ కాదు ఒక కాల్వ కాదని.. కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ , అనంతగిరి రిజర్వాయర్, గంధ మల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ , మిడ్ మానేరు రాజరాజేశ్వర సాగర్, ఎస్సారెస్పీ పునరుర్జీవ ప్రాజెక్టు అని చెప్పారు. మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ,19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, సముద్ర మట్టం కంటే 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తి పోయడమేనన్నారు.