Adithya Dhar | బాలీవుడ్ స్టార్ నటి యామీ గౌతమ్ తన భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది. మార్చి 12న ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా, తన జీవితంలో ఆయనకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ “నా జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమో చెప్పడానికి మాటలు సరిపోవు, నా సర్వస్వం అయిన ఆదిత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌తో పాటు వారు గతంలో పర్వత ప్రాంతాల్లో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను, జిమ్‌లో దిగిన ఒక సరదా మిర్రర్ సెల్ఫీని కూడా అభిమానులతో యామీ పంచుకోవడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
వీరిద్దరి ప్రయాణం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభం కాగా, 2021లో హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకున్న ఈ జంటకు 2024 మే నెలలో వేదవిద్ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం వృత్తిపరంగా కూడా ఈ జంట ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19న విడుదల కాబోతుండగా, ఇందులో యామీ గౌతమ్ ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల ‘హక్’ సినిమాతో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న యామీ, ఆదిత్య పుట్టినరోజున చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.