న్యూఢిల్లీ: భారతీయ కెప్టెన్ నేతృత్వంలోని ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ చేరింది. అయితే ఇరాన్ దాడులు చేస్తున్న ప్రమాదకర హార్మూజ్ జలసంధిని దాటేందుకు ‘గోయింగ్ డార్క్’ వ్యూహన్ని అనుసరించింది. (First oil tanker reaches India) లైబీరియా జెండా కలిగిన చమురు ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్‌మాక్స్ బుధవారం ఉదయం ముంబై పోర్ట్‌కు చేరుకున్నది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఫిప్యార్డ్ నుంచి 1,35,335 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను భారత్‌కు దిగుమతి చేసింది. భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు దీనికి నేతృత్వం వహించారు. భారత్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ పౌరులతో కూడిన 29 మంది సిబ్బంది ఇందులో ఉన్నారు.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ ఈ దాడుల్లో హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నది. దీంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
మరోవైపు ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు నేతృత్వంలోని లైబీరియా ఆయిల్ ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్‌మాక్స్ మార్చి 1న సౌదీ అరేబిలోని రాస్ తనూరా ఫిప్యార్డ్ నుంచి చమురు లోడ్‌తో బయలుదేరింది. మార్చి 8న హార్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నది. ఈ ఆయిల్ ట్యాంకర్ ఇక్కడ ఉన్న సంకేతాలు చివరిసారిగా మార్చి 8న కనిపించినట్లు సముద్ర ట్రాకింగ్ డేటా చూపించింది. ఆ తర్వాత ఈ ఆయిల్ ట్యాంకర్ జాడ ట్రాకర్ నుంచి అదృశ్యమైంది.
అయితే హార్ముజ్ జలసంధిలోని ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్‌లపై ఇరాన్ దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో తన ఉనికిని పసిగట్టకుండా ఉండేందుకు ‘గోయింగ్ డార్క్’ వ్యూహన్ని ఈ ఆయిల్ ట్యాంకర్ అనుసరించింది. నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), ట్రాన్స్‌పాండర్స్ స్విచ్‌లను ఆఫ్ చేశారు. రెండు రోజుల పాటు రాత్రివేళ అత్యంత అప్రమత్తంగా హార్ముజ్ జలసంధి మీదుగా ఈ ఆయిల్ ట్యాంకర్ ప్రయాణించింది. సురక్షితంగా దాటిన తర్వాత భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది.
ఆ తర్వాత ఈ ఆయిల్ ట్యాంకర్‌లోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), ట్రాన్స్పాండర్ల స్విచ్‌ను ఆన్ చేశారు. దీంతో సముద్ర ట్రాకింగ్ వ్యవస్థలపై ఈ ట్యాంకర్ మళ్లీ కనిపించింది. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు ఇరాన్‌తో భారత్ దౌత్య సంప్రదింపులు కూడా సహకరించాయి.
కాగా, శత్రువులు తమను లక్ష్యంగా చేసుకోకుండా ఉండేందుకు, ట్రాక్ చేయడాన్ని నివరించేందుకు కార్గో ఫిప్‌లు తరచుగా ‘గోయింగ్ డార్క్’ వ్యూహాన్ని అనుసరిస్తాయి. దాడులు వంటి ప్రమాదాల నుంచి బయటపడతాయి. అయితే కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి.
Also Read:
Don’t panic on LPG | ఎల్పీజీ కొరతపై భయాందోళన వద్దు.. అనవసరంగా బుకింగ్ చేయవద్దు: కేంద్రం
Induction cooktops | దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. ఇండక్షన్ కుక్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్