Dhurandhar | యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు చిత్రబృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మళ్లీ థియేటర్లలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ దురంధర్ : ది రివెంజ్ విడుదలకు ముందు ప్రేక్షకులను మళ్లీ అదే యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం విడుదలైనప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సీక్వెల్ రిలీజ్‌కు ముందు మొదటి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇండియాలో సుమారు 250 స్క్రీన్లలో మార్చి 12 నుంచే సినిమా మళ్లీ ప్రదర్శితం అవుతోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా మరో 250 థియేటర్లలో మార్చి 13 నుంచి ‘దురంధర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే దాదాపు 185 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుండటం విశేషం. ఇండియాలో సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేయడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. అయితే ఒక హిందీ సినిమాను ఓవర్సీస్ మార్కెట్లో ఇంత పెద్ద స్థాయిలో మళ్లీ రిలీజ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. నార్త్ అమెరికా మార్కెట్లోనే 185 స్క్రీన్లలో ప్రదర్శన ఉండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు.
మొదటి భాగాన్ని పెద్ద తెరపై మళ్లీ చూసి, వెంటనే సీక్వెల్‌ను ఆస్వాదించే అవకాశం రావడం అభిమానులకు పండగలాంటిదిగా మారింది. దీంతో ఫ్యాన్స్ కూడా థియేటర్లకు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీక్వెల్ ‘దురంధర్: ద రివేంజ్’ విడుదలను కూడా మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. గ్లోబల్ రిలీజ్‌కు ఒకరోజు ముందుగా, అంటే మార్చి 18న అమెరికా, కెనడాలో ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్స్‌ను ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్లు, డాల్బీ అట్మాస్ వంటి అత్యాధునిక సౌండ్ టెక్నాలజీలతో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ఈ ప్రీమియర్ షోల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాను ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తన ప్రత్యేక విజన్‌తో తెరకెక్కించారు. చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా మార్చి 19, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది .