Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా- ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధం తీవ్రతరం అవుతుండటం, ఎఫ్ఐఐ (FII) ల విక్రయాలు కొనసాగుతుండటం లాంటివి ప్రతికూల ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి భగ్గుమనడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
దాంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. సందట్లో సడేమియా అన్నట్లు భారత్ సహా 16 దేశాల వాణిజ్య పద్ధతులపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడంతో కొత్త టారిఫ్ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 23,650 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 76,369.65 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,863.71) నష్టాల్లో ప్రారంభమైంది.
రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,871.18 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.17గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి.