రాయపోల్ సెప్టెంబర్ 08 : గత మూడు రోజుల నుంచి యూరియా సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదని పలు గ్రామాల రైతులు వాపోయారు. మూడు రోజుల నుంచి యూరియా కోసం కోసం వ్యవసాయ పనులు వదులుకొని నిత్యం మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని, అయినప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడం వలన తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి తరలిరావడంతో ఓదశలో తొక్కిసలాట జరిగింది. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను బుజ్జగించారు. సాయంత్రం వరకు మరో లారీ యూరియా వస్తుందని రైతులు ఆందోళన విరమించాలని పేర్కొనగా రైతులు శాంతించారు. కాగా 200 బస్తాల యూరియా రాగా అధిక మొత్తంలో రైతులు ఉండడంతో యూరియా కోసం రైతులు ఎగబడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.