శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్లో పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని సామూహిక సమాధులున్నాయి. (Unmarked Graves) అయితే వీటిలో 90 శాతం ఉగ్రవాదుల సమాధులేనని తేలింది. కశ్మీర్‌కు చెందిన సేవ్ యూత్ సేవ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ ఈ సమాధులపై అధ్యయనం చేసింది. వజహత్ ఫరూక్ భట్ నేతృత్వంలోని బృందం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, బందిపోరా, మధ్య కశ్మీర్‌లోని గండర్బాల్ సరిహద్దు జిల్లాలలోని 373 స్మశాన వాటికలను భౌతికంగా పరిశీలించింది. ట్యాగింగ్, ఫొటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్, స్థానికుల సాక్ష్యాలు, అధికారిక రికార్డుల ఆధారంగా మొత్తం 4,056 సమాధులను గుర్తించారు. వీటిలో 90 శాతం విదేశీ, స్థానిక ఉగ్రవాదులకు చెందిన సమాధులేనని నిర్ధారించారు.
కాగా, మొత్తం 4,056 సమాధుల్లో 2,493 సమాధులు (61.5 శాతం) తీవ్రవాద కార్యకలాపాల్లో మరణించిన విదేశీ ఉగ్రవాదులకు చెందినవిగా ఈ బృందం గుర్తించింది. 1,208 సమాధులు (29.8 శాతం) భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించిన కశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాదులకు చెందినవిగా స్థానికులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఇక్కడ కేవలం తొమ్మిది (0.2 శాతం) మాత్రమే పౌర సమాధులను కనుగొన్నారు.
మరోవైపు 1947లో జరిగిన కశ్మీర్ యుద్ధంలో మరణించిన గిరిజన ఆక్రమణదారులకు చెందిన 70 సమాధులను కూడా ఈ అధ్యయన బృందం గుర్తించింది. ఈ ప్రాంతంలో సంఘర్షణకు సంబంధించిన ఖననాల చరిత్రను హైలైట్ చేసింది. ‘సత్యాన్ని వెలికితీయడం: ఎ క్రిటికల్ స్టడీ ఆఫ్ అన్మార్క్డ్ అండ్ అన్ఐడెంటిఫైడ్ గ్రేవ్స్ ఇన్ కశ్మీర్ వ్యాలీ’ అనే పేరుతో ఒక నివేదికను రూపొందించింది.
కాగా, తమ అధ్యయన నివేదికను ప్రభుత్వ సంస్థలకు అందజేస్తామని వజహత్ ఫరూక్ భట్ తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని గుర్తు తెలియని సామూహిక సమాధులపై ఉన్న ఆరోపణలు, భిన్న కథనాలు, అపోహలను తమ అధ్యయనం నివృత్తి చేస్తుందని అన్నారు. ప్రజల నిధులతో నిర్వహించే ఈ ఎన్జీవో సంస్థ 2018లో ఈ ప్రాజెక్టును ప్రారంభించి 2024లో ప్రాథమిక పనిని పూర్తి చేసిందని వివరించారు.
Also Read:
Newly wed Woman Ends Life | ప్రేమించిన వ్యక్తితో వివాహం.. పెళ్లైన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య
Fake Babas Arrested | బంగ్లాదేశ్ జాతీయులతో సహా.. 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్
Lalu Prasad Yadav | లాలూను కలిసిన ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. బీజేపీ విమర్శ