డెహ్రాడూన్: ప్రజలను మోసం చేయడం, మత మార్పిడికి పాల్పడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు, నకిలీ బాబాలను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలనేమి’ చేపట్టింది. దీని కింద ఇప్పటి వరకు 14 మంది నకిలీ బాబాలను అరెస్ట్ చేసింది. (Fake Babas Arrested) వీరిలో కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ కింద రాష్ట్రంలో 5,500 మందికి పైగా వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారని, వీరిలో 1,182 మందిపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.
కాగా, ఈ ఏడాది జూలైలో ‘ఆపరేషన్ కాలనేమి’ని ఉత్తరాఖండ్ పోలీసులు ప్రారంభించారు. ఈ ఆపరేషన్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఐజీపీ భరానే తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రశ్నించినట్లు చెప్పారు. ఆగస్ట్‌లో 4,000 మందిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత 300 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
మరోవైపు హరిద్వార్‌లో 2,704 మందిని తనిఖీ చేసిన తర్వాత ముగ్గురిని, డెహ్రాడూన్‌లో 922 మందిని తనిఖీ చేసిన తర్వాత ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఐజీపీ భరానే తెలిపారు. టెహ్రీ, పౌరి, అల్మోరా, నైనిటాల్తోపాటు ఇతర జిల్లాల్లో కూడా ‘ఆపరేషన్ కాలనేమి’ కింద పోలీసులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ‘దేవభూమి పవిత్రత’ను కాపాడటమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అన్నారు.
కాగా, బంగ్లాదేశ్ పౌరుడైన అమిత్ కుమార్ బెంగాలీ వైద్యుడిగా చెలామణి అవుతున్నాడని, గత ఎనిమిది ఏళ్లుగా నకిలీ పత్రాలతో సెలాకీలో నివసిస్తున్నాడని ఐజీపీ భరానే తెలిపారు. అతడి ఆధారాలు పరిశీలించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ఇఫ్రాజ్ అహ్మద్ లోలు తన మతాన్ని దాచాడని వివరించారు. ఢిల్లీకి చెందిన రాజ్ అహుజా అనే ధనవంతుడిగా నటిస్తూ మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, అతడ్ని కూడా సెలాకీలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Gang-Raped By 2 Men | పుట్టిన రోజు పార్టీ తర్వాత.. యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం