సిమ్లా : కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని ఏఐ సమ్మిట్లో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఢిల్లీ పోలీసులకు, హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను హిమాచల్ పోలీసులు నిర్బంధించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ పోలీసులు ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని హిమాచల్ పోలీసులు ఆరోపించారు.
తర్వాత నిర్బంధంలో ఉన్న ఢిల్లీ పోలీసులను సిమ్లాలోని షోగీ బారియర్ నుంచి విడుదల చేయడంతో గురువారం ఉదయం వారు ముగ్గురు యూత్ కాంగ్రెస్ నేతలతో పాటు ఢిల్లీకి బయలుదేరారు. తాము సిమ్లాకు వెళ్లి ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశామని, వారిని ఢిల్లీ తరలించడానికి ట్రాన్సిట్ రిమాండ్ కోసం సిమ్లాలోని స్థానిక కోర్టును ఆశ్రయించగా, హిమాచల్ పోలీసులు తమను నిర్బంధించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.