న్యూఢిల్లీ : మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్ లేకుండా వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ వాడాలంటే సిమ్ తప్పనిసరిగా ఉండాలంటూ జారీచేసిన ‘సిమ్ అనివార్యం’ నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్‌లైన్‌గా కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించబోమని కేంద్రం స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు, సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమలులోకి తెస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరాటై, జోష్ లాంటి సామాజిక మాధ్యమాల వినియోగానికి మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా సిమ్ ఉండాల్సిందే.
అలాగే కంప్యూటర్లో లాగిన్ చేసిన వాట్సాప్ కూడా ఆరు గంటల తర్వాత ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్ నిబంధనలు కూడా మారిపోతున్నాయి. గతంలో మొబైల్ నుంచి సిమ్ తొలగించినా వాట్సాప్ యాప్ యథావిధిగా పనిచేసేది. అయితే మార్చి 1 నుంచి రిజిస్టరైన సిమ్ తప్పనిసరిగా మొబైల్లో ఉండాలి. పైగా అది క్రియాశీలకంగా (అంటే రీచార్జి చేసి) ఉండాలి. అలాగే గతంలో పర్సనల్ కంప్యూటర్లలో వాట్సాప్‌ను లాగిన్ చేస్తే అది ఎన్ని రోజులైనా క్రియాశీలకంగా ఉండేది. కొత్త నిబంధన ప్రకారం ఆరు గంటల తర్వాత అది ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. గతంలో ఎక్కడి నుంచైనా ఓటీపీని ఉపయోగించి వాట్సాప్‌కు లాగిన్ అయ్యే వారు. ఇప్పుడు సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు.