చెన్నై: పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటర్లు సమిష్టిగా బాదడంతో ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల రికార్డు స్కోరు చేసింది.
అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హార్ధిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్, 4 సిక్స్‌లు), తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం సృష్టించారు. రికార్డు ఛేదనలో జింబాబ్వే.. బ్రియాన్ బెన్నెట్ (58 బంతుల్లో 93 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) పోరాటంతో 20 ఓవర్లకు 184/6 రన్స్ చేసింది. సికందర్ రజా (21 బంతుల్లో 31, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి అండగా నిలిచాడు. బ్యాట్‌తో సత్తాచాటిన టీమ్ఇండియా.. బంతితో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడింది.
రికార్డు ఛేదనలో మెరుపులేమీ లేకపోయినా జింబాబ్వే బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బుమ్రాతో పాటు స్పిన్నర్లు వరుణ్, అక్షర్ సైతం తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా పట్టుదలగా ఆడింది. 2 సిక్స్‌లు కొట్టిన మరుమాని (20), బెన్నెట్ తొలి వికెట్‌కు 44 రన్స్ జోడించారు. పవర్ ప్లే తర్వాత అక్షర్.. మరుమానిని బోల్తా కొట్టించి తొలి వికెట్ పడగొట్టాడు. కానీ అతడే వేసిన 9వ ఓవర్లో బెన్నెట్.. 6, 4, 6తో 19 రన్స్ రాబట్టాడు.
వరుణ్ తన రెండో ఓవర్లో మైయర్స్ (6)ను వెనక్కి పంపాడు. అయితే బెన్నెట్.. బుమ్రా ఓవర్లో సిక్స్‌తో టోర్నీలో మూడో హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. ఇక అక్కడ్నుంచి రజా అండతో భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. దూబె ఓవర్లో 6, 4, 4, 6తో ఏకంగా 26 రన్స్ వచ్చాయి. రజా, బెన్నెట్ మూడో వికెట్‌కు 72 రన్స్ జోడించి ఆ జట్టును భారీ ఓటమి నుంచి తప్పించారు. బెన్నెట్ ఆఖర్లో 3 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ అవడంతో క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లందరూ దూకుడుగానే ఆడారు. ఎక్కువసేపు క్రీజులో లేకున్నా రెండు భారీ సిక్స్‌లు, ఓ బౌండరీతో శాంసన్ (24) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించాడు. తన శైలికి భిన్నంగా ఆరంభంలో ఆచితూచి ఆడిన అభిషేక్.. శాంసన్ నిష్క్రమణ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 72 రన్స్ జతచేశాడు. బెన్నెట్ 9వ ఓవర్ రెండో బంతికి లాంగాన్ మీదుగా అభిషేక్ కొట్టిన సిక్స్‌తో టీమ్ఇండియా వంద పరుగుల మైలురాయిని అందుకుంది. రజా ఓవర్లో సింగిల్‌తో ఈ టోర్నీలో అతడు తొలి అర్ధ శతకాన్ని అందుకున్నాడు.
26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇషాన్.. రజా ఓవర్లో 4,6 బాదినా నాలుగో బంతికి గరవకు క్యాచ్ ఇచ్చాడు. వస్తూనే బౌండరీతో పరుగుల వేటను మొదలెట్టిన సూర్య (13 బంతుల్లో 33, ఫోర్లు 3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. మపొస ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి లాంగాన్‌లో అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను రజా ఒడిసిపట్టుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో సూర్య నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన తిలక్‌తో కలిసి హార్ధిక్ జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నారు. 15 ఓవర్లకే 176/4తో ఉన్న టీమ్ఇండియా.. ఆఖరి ఐదు ఓవర్లలో 80 రన్స్ రాబట్టింది.
ఈ విజయంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌తో కలిసి 2 పాయింట్లతో భారత్ సమంగా ఉన్నా నెట్న్ రేట్ విషయంలో విండీస్(+1.791) టీమ్ఇండియా (-0.100) కంటే మెరుగ్గా ఉండి రెండో స్థానంలో నిలిచింది. రెండు ఓటములతో జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించగా దక్షిణాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధించింది. వచ్చే ఆదివారం వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు గ్రూప్-1 నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రైద్దెతే మాత్రం అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.
2 ఈ మెగా టోర్నీ చరిత్రలో ఇదే రెండో అత్యుత్తమ స్కోరు. మొదటి స్థానంలో శ్రీలంక (2007లో కెన్యాపై 260/6) ఉంది.
భారత్: 20 ఓవర్లకు 256/4 (అభిషేక్ 55, హార్ధిక్ 50*, రజా 1/29, మపొస 1/40);
జింబాబ్వే: 20 ఓవర్లకు 184/6 (బెన్నెట్ 97*, రజా 31, అర్ష్‌దీప్ 3/24, అక్షర్ 1/35)
