KTR | హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు తాగునీటిని అందించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని పేర్కొన్నారు. రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే అని.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్లయినా నీటి కొరత లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ రిపోర్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అదే కంపెనీ నిర్మిస్తున్న ఎన్ హెచ్ 66 రహదారిలో స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కూలడంతో నేషనల్ హైవే అథారిటీ ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసిందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీకి 7000 కోట్ల రూపాయల పనులు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
సొంత నియోజకవర్గం కొడంగల్ లో 4 వేల కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా మంత్రి పొంగులేటి కంపెనీతో పాటు అదే ఏజెన్సీకి ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్ట్ కంపెనీ, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో భాగమైన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ బ్లాక్ చేసిన కంపెనీని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బ్లాక్ లిస్టు చేయడం లేదు. ఇది క్రిమినల్ కుట్ర కాదా? అని నిలదీశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోచుకొని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. ఒకేసారి 1,50,000 కోట్లను దోచుకోకుండా విడతల వారీగా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ కంపెనీలకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అప్పగించాలని రేవంత్ రెడ్డి ఆత్రంగా ఉన్నాడని కేటీఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడానికి, మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి, యువతకు స్కూటీలు ఇవ్వడానికి, ముసలి వాళ్లకు 4000 పెన్షన్ ఇవ్వడానికి మాత్రం రేవంత్ రెడ్డి ఆత్రం చూపించడం లేదని విమర్శించారు. అక్కడైతే కమీషన్లు రావని భావిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. 16 వేల కోట్ల రూపాయలతో అయిపోయే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనాలను లక్షా యాభై వేల కోట్లకు పెంచి లూటీ చేయాలని చూస్తున్నారని అన్నారు.
ఇంకో 500 సంవత్సరాల పాటు హైదరాబాద్కుకి తాగునీటి కొరత రాకుండా చూసే బాధ్యత కేసీఆర్‌ది.. బీఆర్ఎస్ ది అని స్పష్టం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్‌ను నిర్మించామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మేం అధికారంలోకి వచ్చాక 24 గంటలు హైదరాబాద్‌లో నల్లా నీళ్లు వచ్చేలా చూస్తామని అన్నారు. ఈ ముఖ్యమంత్రికి అది చేతకాదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత తాగు నీటి పథకాన్ని కూడా కాంగ్రెస్ రద్దు చేస్తుందని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాములపై ప్రశ్నిస్తే మాట్లాడటం లేదని.. దీనిపై బీజేపీని అడిగితే వాళ్లు కూడా మాట్లాడటం లేదని కేటీఆర్ తెలిపారు. ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి ఆరోపించినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా గోదావరి రింగ్ మెయిన్ ప్రాజెక్టును, మూసీ సుందరీకరణ పూర్తి చేసేది కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు.