కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చేశారు. కొత్తగూడెం నగరంలోని మధుర బస్తీకి చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సదరు యువకుడి ఇంటిపై తెల్లవారుజామున రైడ్ చేసి మూడు గంటల పాటు సోదాలు జరిపినట్లుగా సమాచారం. సదరు యువకుడికి సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని క్షుణ్ణంగా విచారణ చేసినట్లు సమాచారం. అయితే సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు సంబంధించి సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు ధ్రువపడాల్సి ఉంది.