TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా గడిచిన 24గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, వికారాబాద్‌తో పాటు పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లా రెగోడ్ గ్రామంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.