Telangana | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలనే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా అనుసరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పరిమితం చేస్తూ రాష్ట్రాలను అప్పుల వైపు, మ్యాచింగ్ గ్రాంట్ల వైపు మళ్లించాలన్న నరేంద్రమోదీ సర్కార్ వ్యూహంలో తెలంగాణ చికుకున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి బడ్జెట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్ కసరత్తు చూస్తుంటే.. రాష్ట్రం తన స్వయంప్రతిపత్తిని వదులుకొని కేంద్రం నిర్దేశించిన ‘రుణాధారిత అభివృద్ధి’ నమూనాలోకి వెళ్తున్నదా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. భారీ ప్రాజెక్టుల మోజులో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను దీర్ఘకాలిక అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే ఉపాధి, అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సాగునీరు, రవాణా, పట్టణాభివృద్ధి, విద్యుత్తు రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఇటీవల అధికారును ఆదేశించారు. ముఖ్యంగా ఫ్యూచర్‌సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్), మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల లాంటి మెగా ప్రాజెక్టులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర పథకాల ద్వారా లభించే నిధులతోపాటు వడ్డీలేని రుణాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే రూ.1.5 లక్షల కోట్ల వడ్డీలేని రుణాల్లో గరిష్ఠ వాటా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
కేంద్రం నుంచి నిధులను రాబట్టడం మంచిదే అయినా అది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకూడదు. అప్పులతో చేసే అభివృద్ధి పైకి బాగానే కనిపించినప్పటికీ భవిష్యత్తులో వడ్డీ చెల్లింపులు భారంగా మారుతాయి. ప్రభుత్వం రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోకుండా కేవలం అప్పులు, కేంద్ర రుణాలపై ఆధారపడి భారీ ప్రాజెక్టులు చేపట్టడం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని, తక్షణ ఉపశమనం కోసం చేసే అప్పులు దీర్ఘకాలంలో భారంగా మారుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని, పూర్తిగా మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యమిస్తే సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మధ్య సమతుల్యత పాటించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు 50 ఏడ్ల కాలపరిమితితో రూ.1.5 లక్షల కోట్ల వడ్డీలేని రుణాలను కేటాయించారు. ఇందులో కనీసం రూ.15 వేల కోట్లు రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ‘అమృత్’ ద్వారా రూ.2,500 కోట్లు, హైవేలు/ట్రిఫుల్‌ఆర్ ద్వారా రూ.3 వేల కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కింద రూ.1,500 కోట్లు తెచ్చుకోవాలని చూస్తున్నది. కానీ, ఈ నిధులు పొందాలంటే రాష్ట్రం కూడా సమాన స్థాయిలో నిధులు (మ్యాచింగ్ గ్రాంట్స్) కేటాయించాలి. ‘అమృత్’, స్మార్ట్ సిటీస్, పీఎం గతిశక్తి లాంటి పథకాల కింద నిధులు కావాలంటే భూసేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాలి. ఈ విధానం వల్ల రాష్ట్రాలపై అప్పుల భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కఠిన నిబంధనలతో కేంద్రం ఇచ్చే అదనపు అప్పులు తీసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విముఖత చూపింది. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెట్టాలనే నిబంధనను తిరసరించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం నాడు దాదాపు రూ.12 వేల కోట్ల అదనపు రుణాన్ని వదులుకున్నది. కానీ, ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కార్ కేంద్రం విధించే కఠిన నిబంధనలకు తలొగ్గి నిధులను రాబట్టాలని చూస్తున్నది. కేంద్ర నిధులు రావాలంటే భూసేకరణ ఖర్చును పూర్తిగా రాష్ట్రమే భరించాలి. దీనికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కేంద్రం నుంచి తెచ్చుకునే ప్రతి రూ.100కు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 నుంచి రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆ నిధులను పూర్తిగా మౌలిక సదుపాయాలకు మళ్లిస్తే 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నది.