బూర్గంపహాడ్, జూన్ 05 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించడం లేదని, పనుల ప్రదేశంలో సరైన వసతులు కల్పించడం లేదని బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్కు చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల పాటు ఎండలో శ్రమిస్తున్నప్పటికీ కూలీ మాత్రం రూ.130 మాత్రమే వేతనంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించేలా కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం క్షేత్రస్థాయిలో లక్ష్యానికి విరుద్ధంగా సాగుతుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, విశ్రాంతి తీసుకునేందుకు నీడ కూడా కరవైందని ఆరోపించారు.
ఉదయం నుండి ఎండలో కష్టించి పని చేస్తున్నా శ్రమకు తగిన ఫలితం ఉండడం లేదని, కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఉండడం లేదని దీనిపై ఈజీఎస్ అధికారులు స్పందించాలని మండిపడ్డారు. కూలీలు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సంబంధిత శాఖ అధికారులు అక్కడకు చేరుకుని కూలీల ఇబ్బందులను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పి, పనుల ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.