సిద్దిపేట, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు హైమావతి, ప్రతిమాసింగ్, ప్రతీక్ జైన్ విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలో 8,74,181 లక్షల మంది ఓటర్లు,మెదక్ జిల్లాలో 4,10,204 లక్షల మంది ఓటర్లు, సంగారెడ్డి జిల్లాలో 11,59,158 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ అనంతరం జాబితాను రూపొందించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణతో ప్రక్రియ ముగియలేదు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజులు ఓటర్లకు క్లెయిమ్స్, అభ్యంతరాలు సమర్పించే అవకాశం కల్పించారు.తమ పేరు జాబితాలో లేకపోయినా, పేరు తొలిగించబడినా, వయస్సు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులున్నా సంబంధిత ఈఆర్వో లేదా ఏఈఆర్వో కార్యాలయాల్లో క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేయవచ్చు. ప్రతి ఓటరు తమ పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులు సూచించారు. పేరు మాత్రమే కాకుండా వయస్సు, చిరునామా, ఇతర వివరాలను కూడా జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబ సభ్యులు, అర్హత కలిగిన ఇతర వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల నమోదు అధికారి, సహాయ ఓటర్ల నమోదు అధికారుల కార్యాలయాల నోటీసు బోర్డులపై ముసాయిదా ఓటర్ల జాబితాలను ఓటర్ల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. 01-10-2026వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన యు వతతో పాటు ఓటరుగా నమోదు కావ డానికి అర్హత ఉన్న ప్రతి పౌరుడు నమోదు చేసుకోవాలి. కాగా ఒటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందించేందుకు ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పెంచింది. గత నెల 24న చివరి తేదీ ఉండగా పది రోజులు గడువు పెంచుతూ ఆగస్టు 3 చివరి తేదీగా ప్రకటించింది. తిరిగి మరోసారి ఏడురోజుల గడువు పెంచుతూ ఆగస్టు 10వ తేదీ వరకు ఫారాలు తీసుకున్న విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను అధికారులు సోమవారం ప్రచురించారు. 32-హుస్నాబాద్, 33-సిద్దిపేట, 41-దుబ్బాక, 42-గజ్వేల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 8,74,181 మంది ఓటర్లతో డ్రాఫ్ట్ జాబితా సిద్ధమైంది. ఈ జాబితాలను సంబంధిత ఈఆర్వో కార్యాలయాలతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో అత్యధికంగా 42-గజ్వేల్ నియోజకవర్గంలో 2,51,793 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత హుస్నాబాద్‌లో 2,30,222, సిద్దిపేటలో 2,05,337, దుబ్బాకలో 1,86,829 మంది ఓటర్లు ఉన్నారు.
డ్రాఫ్ట్ ప్రచురణకు ముందు గుర్తించిన ఏఎస్డీ (ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్) ఓటర్లు జిల్లాలో మొత్తం 1,18,786 మంది ఉన్నారు. వీరిలో సిద్దిపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా 39,170 మంది ఉండగా, గజ్వేల్‌లో 37,460, హుస్నాబాద్ లో 24,321, దుబ్బాకలో 17,835 మంది ఉన్నారు. జిల్లా మొత్తం ఏఎస్డీ ఓటర్లతో పోలిస్తే సంఖ్య సుమారు 13.59 శాతం ఉంది. ఓటరు వివరాల్లో గుర్తించిన తప్పుల్లో మొత్తం 1,99,180 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గజ్వేల్‌లో అత్యధికంగా 60,979, సిద్దిపేటలో 50,061, హుస్నాబాద్‌లో 49,216, దుబ్బాకలో 38,924 ఉన్నాయి.
మెదక్ జిల్లాలో రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 34-మెదక్, 37-నర్సాపూర్ శాసనసభల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)2026 ప్రక్రియలో భాగంగా, సమీకృత ముసాయిదా పొటో ఓటర్ల జాబితా, సర్వీస్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మెదక్ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు పురుషులు 96,184, మహిళలు 105518,థర్డ్ జెండర్లు ముగ్గురు మొత్తం 2,01,705 ఓటర్ల లో ఎన్ఆర్ఐ ఓటర్లు ఐదుగురు ఉన్నారు.
వీరి లో నాలుగురు పురుషులు, ఒకరు మహిళ ఉన్నారు. నియోజకవర్గంలో సర్వీస్ ఓటర్లు మొత్తం 81మంది ఉండగా, వారిలో 80 మంది పురుషులు, ఒకరు మహిళ ఉన్నారని అధికారులు వెల్లడించా రు. నర్సాపూర్ ని యోజకవర్గంలో పురుషులు 101376, మహిళలు 107118, థర్డ్ జెండర్లు 5 మొత్తం 2,0 8,499 ఓటర్లలో ఎన్ఆర్ఐ ఓటర్లలో ఒక పురుషుడు ఉన్నారు.నియోజకవర్గంలో సర్వీస్ ఓట ర్లు మొత్తం 38మంది ఉండగా, వారిలో పురుషులు 36 మంది మహిళలు ఇద్దరు ఉన్నారు.