గోపాల్పేట, ఆగస్టు 17: బయట నుంచి వచ్చిన మేఘారెడ్డి డబ్బులతో వనపర్తి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచాక.. నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనంచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ భరిస్తున్నానని, లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. తాము తలపెట్టిన పనులకు అడ్డుతగులుతూ.. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహనంతో భరిస్తున్నానని చెప్పారు.
తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమి వేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నాడు రేవంత్‌రెడ్డిని ఆదేశించినా.. డబ్బులకు ఆశపడి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్పేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను ఎమ్మెల్యే అనుచరుడి కోసం.. రైతులకు సౌకర్యంగా లేని దూర ప్రాంతంలో నిర్మించారని మండిపడ్డారు. జిల్లా ప్రతిష్టను దెబ్బతిసే నాయకుల భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.