జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఆర్బీ న్యూస్ విలేకరి పుల్లా రవీందర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలలోని పుల్లా రవీందర్ ఇంటికి ఆదివారం రాత్రి 10 గంట ల సమయంలో కాంగ్రెస్ నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, నటరాజ్, బొజ్జం వేణులతోపాటు కొంతమంది గుర్తు తెలియని వ్య క్తులు చొరబడి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావురా? అంటూ కులం పేరుతో దుర్భాషలాడుతూ పిడిగుద్దులు కురిపించారు. ఆయన భార్య కళావతి గొంతు, ముక్కు మూసి హత్యచేయడానికి యత్నించారు.
ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. బంధువులు రవీందర్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు తీసుకెళ్లారు. రవీందర్‌పై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. సమగ్ర విచారణ జరిపి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌కు వినతిపత్రం అందజేశారు. దాడిచేసిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎస్పీని కోరారు. దవాఖానలో జర్నలిస్టు రవీందర్‌ను పరామర్శించారు.