బూర్గంపహాడ్, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్మాగారం పరిసరాల్లో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ రాంబాబు, టెక్నికల్ హెడ్ జయంత్కుమార్దాస్, ఎన్విరాన్మెంట్ హెడ్ ప్రపుల్లా కుమార్ సమంత సింగార్లతో కలిసి మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం అలవాటు చేసుకోవాలన్నారు.
కాలుష్యాన్ని నివారించడం కోసం కర్మాగారంలో పచ్చదనానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అనంతరం కార్మిక కుటుంబాల పిల్లలు, మేనేజర్లు, కార్మికులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అదేవిధంగా కర్మాగారం పరిసరాల్లో, లారీ యార్డు ఆవరణలో మేనేజర్లు, ఐటీసీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారులు చెంగల్రావు, టీఎస్ భాస్కర్, ఆర్పీ సింగ్, మనీష్ శర్మ, శివరామకృష్ణ, సౌరబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత : ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్