Forest Beat Officer | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు. అటవీ భూముల అమ్మకం ద్వారా డబ్బులు రాబట్టుకోవాలన్న యావే తప్ప ప్రైవేటు వ్యక్తుల దురాక్రమణలకు గురవుతున్న అటవులను రక్షించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అడవులను కాపాడాల్సిన బీట్ ఆఫీసర్ల పోస్టులు 1,393 ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ గత రెండేండ్ల నుంచి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మరిన్ని అటవీ భూములు దురాక్రమణకు గురయ్యే అవకాశం ఉన్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రాష్ట్ర అటవీశాఖలో మంజూరైన 3,650 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల్లో 1,462 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,393 ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులు, 69 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 274 ఎఫ్ఆర్వో పోస్టుల్లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మిగిలిన క్యాడర్ పోస్టుల్లో కూడా చాలా మేరకు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం అటవీ శాఖలో రెండు రకాల కారణాల వల్ల భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ హయాంలో 2019లో దాదాపు 1,950 వరకు ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేశారు. ఆ ఉద్యోగాలు పొందినవారంతా వెంటనే విధుల్లో చేరారు. వారిలో ఎంటెక్, బీటెక్, డబుల్ పీజీలు చేసిన చాలా మందికి ఆ తర్వాత గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 వంటి ఉద్యోగాలు రావడంతో బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. కాలక్రమంలో మరికొందరికి సెక్షన్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం, ఇంకొందరు ఉద్యోగ విరమణ పొందడంతో మొత్తం 1,393 బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేయాలని కోరుతూ అటవీ శాఖ ఉన్నతాధికారులు 9 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి లేఖ రాసినా ఇప్పటికీ ఎలాంటి చలనం లేదు. దీంతో అటవీ భూముల కబ్జాలు, చెట్ల నరికివేతలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా బీట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీచేసి అడవులను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.