ట్రాఫిక్ అవాంతరాల నుంచి ఉపశమనం కలిగించడం కోసం, దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణ అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి తరచుగా రక్తసిక్తమవుతోంది. సుదూరప్రాంతాలకు సులభంగా వెళ్లడానికి రూపొందించిన ఈ రహదారి ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ.. అసలు అధికారికంగా ప్రారంభం కాకుండానే, పూర్తిస్థాయిలో పనులు జరగకుండానే వాహనాలన్నింటినీ ఈ నయా రహదారిపై ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో దీనిపై రాకపోకలు సాగించేందుకు ఈ రహదారి ఎక్కిన అనేకమంది ప్రయాణికుల మొదటి ప్రయాణమే చివరి ప్రయాణంగా మారుతోంది.
ప్రభుత్వ అలసత్వం కారణంగా రెండు రోజుల క్రితం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై జరిగిన ప్రమాదంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిన తీరు జిల్లా ప్రజలను కలచివేస్తోంది. తమ కుమారుడిని ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పించేందుకు చింతకాని మండలం గాంధీనగర్ కాలనీ నుంచి పాపబత్తిని నర్సింహారావు, భార్య సుజాత సిద్ధమయ్యారు. వారు తమ కుమారుడు పవన్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరి తమ ఊరి పక్కనే ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎక్కారు.
ఆ మరుక్షణంలోనే వారు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మరణించారు. ఆ ప్రమాదాన్ని చూసిన ప్రజలు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు చేసిన పాపమో వీరికి శాపంగా మారిందంటూ శాపనార్థాలు పెడుతూ నిట్టూర్చారు. పనులు పూర్తి కాకుండానే రహదారిని ప్రారంభించడం, వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణసంకటంగా ప్రయాణం..
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162.50 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎన్‌హెచ్ (365బీజీ) పనులు అనేకచోట్ల ఇంకా పూర్తికాలేదు. అయినప్పటికీ ఈ హైవేపై వాహనాల రాకపోకలతో ప్రభుత్వం అనుమతించడంతో దీనిపై ప్రయాణం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. ఖమ్మం నగరంలో భారీ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయనే, నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే కారణంతో ఈ గ్రీన్‌ఫీల్డ్‌పై వాహనాల రాకపోకలను అనుమతించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదాల నివారణకు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
ఈ రహదారి ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే సుమారు 15 రోడ్డు ప్రమాదాలు సంభవించడం గమనార్హం. దీనిలో తల్లాడలో కానిస్టేబుల్, వేంసూరులో ఉల్లిపాయల లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి, కల్లూరు మండలం లింగాల వద్ద రెయిలింగ్‌ను బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ప్రమాదాల నుంచి అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గురువారం ఉదయం ఇదే గ్రీన్‌ఫీల్డ్ హైవేపై చింతకాని మండలం గాంధీనగర్‌కు చెందిన తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎంట్రీలు, ఎగ్జిట్లు పూర్తికాకుండానే..
తల్లంపాడు వద్ద ఖమ్మం నుంచి పారంభమయ్యే ఈ గ్రీన్ఫీల్ ప్రధాన రహదారి దేవరపల్లి వరకు వెళ్లేలా ప్రభుత్వం నిర్మించింది. అనేకచోట్ల ఇరువైపులా ఎగ్జిట్లు, ఎంట్రీలు ఇంకా పూర్తికాలేదు. అయినప్పటికీ ఈ రహదారిపై రాకపోకలకు అనుమతించడమే ప్రయాణికుల ప్రాణాల మీదకు వస్తోంది. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద హైదరాబాద్, ఇల్లెందుకు ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లను ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. మరోవైపు నుంచి రహదారి మీదకు వెళ్లేందుకు అవకాశం ఉండడంతో ఇటీవల గాంధీనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు.. వ్యతిరేక దిశలో కారులో హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ దిశలో వేగంగా వచ్చిన డీసీఎం.. ఢీకొట్టడంతో ఆ కారులోని తల్లీ, కొడుకు మృత్యువాత పడ్డారు.
ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే వాహనాల కోసం చేపట్టాల్సిన ర్యాంపుల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అయినప్పటికీ వాహనాలకు అనుమతించడంతో టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల ప్రాణాలపై లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి అనుగుణంగా చింతకాని మండలం వందనం గ్రామం నుంచి దేవరపల్లి వెళ్లాల్సిన ఎగ్జిట్లు, ఎంట్రీలు పూర్తి కాకపోయినా వాహనాలను అనుమతివ్వడంతో కొన్ని కిలోమీటర్ల వరకు వాహనాలు వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తోంది. టర్నింగ్ వచ్చేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వ్యతిరేక దిశలో ఎడమవైపున ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో పనులు చేయకుండానే ప్రయాణికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రారంభం కాకుండానే దానిపై రాకపోకలకు అవకాశం కల్పించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల తీవ్రత ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తోంది. ఈ రహదారిపై నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతోంది. కొందరు మరణిస్తున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ఇంకొన్ని చోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. పూర్తిస్థాయి చర్యలు తీసుకోకుండా ఇరువైపులా రాకపోకలు అనుమతి ఇవ్వడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గాంధీనగర్‌కు చెందిన విద్యార్థి, అతడి తల్లి మరణించడం బాధాకరం. ఇప్పటికైనా ఎన్హెచ్ఏ అధికారులు ఎగ్జిట్, ఎంట్రీలు సత్వరమే పూర్తి చేయాలి. ఆ తరువాతనే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలి.
-సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే