నిజామాబాద్, ఆగస్టు 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ – సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి దాదాపుగా రెండు లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేకపోవచ్చనే అంచనాలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ సంఖ్య అధికారిక తుది తొలగింపు కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్లు పరిష్కరించిన తర్వాతే తుది ఓటరు జాబితా వెలువడుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండు జిల్లాల్లో భారీ సంఖ్యలో వలస కార్మికులు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన కుటుంబాలు, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సరైన సమయంలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండకపోవచ్చని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోన్న సర్ ప్రక్రియ గడువును ఈసీ పొడిగించింది. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా వెల్లడించేందుకు కసరత్తు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు.
ఆగస్టు 17న ముసాయిదా జాబితా…
సవరించిన సర్ షెడ్యూల్ అనుసరించి ఆగస్టు 17వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. ముసాయిదాలో ఓటరు పేరు లేకపోయినా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే పరిశీలించి పేరును తిరిగి చేర్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన వెంటనే తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని పౌరులకు ఎన్నికల యంత్రాంగం సూచిస్తోంది. పే రు లేకపోతే గడువులో క్లెయిమ్ దాఖలు చేసి అవసరమైన ఆధారాలను సమర్పించాలని చెబుతున్నారు.
గడువు ముగిసిన తర్వాత తుది జాబితా ప్రచురితమైతే మార్పులు చేయడం మరింత క్లిష్టమవుతుంది. అందువల్ల ఎన్నికల సంఘం ఇచ్చిన పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు వచ్చిన వినతులను ఇంటింటికి తిరిగి పరిశీలన చేస్తారు. తొలగింపునకు గురైన ఓటరు సమర్పించే ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి పరిష్కారం చూపిస్తారు. తప్పులు, ఒప్పులు సవరించిన తర్వాత అక్టోబర్ 19 తుది ఓటరు జాబితాను వెల్లడిస్తారు. సర్ ప్రక్రియలో పౌరులు కచ్చితంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు నమోదైందా? లేదా? అన్నది చెక్ చేసుకోవడమే అత్యంత కీలకం. అందులో పేరు లేకపోతే వెంటనే బీఎల్వోలను సంప్రదించాల్సి ఉంటుంది.
2.08లక్షల ఓట్లకు చెల్లుచీటి..
నిజామాబాద్ జిల్లాలో మృతి చెందిన వారి ఓట్లు 32,858 ఉన్నాయి. వలస వెళ్లిన వారి ఓట్లు 60,689, డబుల్ ఓట్లు 43,262 గుర్తించారు. మొత్తం 1,36,809 ఓట్లు తొలగించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 20,798 మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్లుగా తేలింది. వలస వెళ్లిన వారి ఓట్లు 29,010 ఉండగా డబుల్ ఓట్లు 16,773 ఉన్నాయి. మొత్తం 71,719 ఓట్లు తగ్గనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలగింపునకు గురయ్యే ఓటర్ల సంఖ్య 2లక్షల 8వేల 528 మంది ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రధాన ఉద్దేశం నిజమైన ఓటరును తొలగించడం కాదని ఈసీ ప్రకటించింది.
అయినప్పటికీ ఆయా రాజకీయ పార్టీల్లో ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు, అపోహలు వెల్లువెత్తుతున్నాయి. మరణించినవారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓటరు నమోదులను తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడిని జాబితాలో చేర్చడమే తమ ఉద్ధేశమని ఎలక్షన్ కమిషన్ పునరుద్ఘాటిస్తోంది. తొలగింపునకు గురయ్యే 2లక్షల ఓట్లలో చాలా మంది డబుల్ ఓట్లు కలిగిన వాళ్లున్నారు. సర్ ప్రక్రియతో ఒకే ప్రాంతంలో ఓటు హక్కు ఉండనుంది. సర్ ప్రక్రియలో బీఎల్వోలు చాలా గ్రామాల్లో, పట్టణం/నగరాల్లో ఇంటింటికీ తిరగలేదు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకే ఓటర్లను పిలిపించుకుని సవరణ ప్రక్రియ చేపట్టడం పలు చోట్ల విమర్శలకు తావిచ్చింది.