RFCL : ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారంలో కన్నుమూసిన వారికి ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘం ఘన నివాళులు అర్పించింది. 36 ఏళ్లనాటి విషాదాన్ని తలచుకుంటూ కన్నీళ్లతో అప్పటి మృతులను స్మరించుకున్నారు నాయకులు. ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘం నాయకుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో 1990లో గ్యాస్ లీకై చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారంలో 1990 సెప్టెంబర్ 17న సెకండ్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వారికి ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆరోజు అనుకోకుండా పైపు నుండి గ్యాస్ లీకై 9 మంది పర్మినెంట్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృత్యువాత పడ్డారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌సీఐ అమర కార్మికులకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఆర్ఎఫ్సీఎల్ అలైడ్ యూనియన్ ప్రెసిడెంట్, 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము ఆధ్వర్యంలో నాయకులు ఆర్ఎఫ్సీఎల్ సర్కిల్లోని అమరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘం నాయకుడు నెలకంటి రాము మాట్లాడుతూ.. మృతిచెందిన కార్మికుల జ్ఞాపకార్థం ఎఫ్‌సీఐ యాజమాన్యం స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కర్మాగారంలో విషవాయువు లీకైన ఘటన జరిగి నేటికీ 36 సంవత్సరాలు పూర్తయింది. ఎఫ్‌సీఐ కర్మాగారం నష్టాల్లో నడవడంతో 1999లో మూసేశారు. మూతబడిన ఎఫ్‌సీఐని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2015 సంవత్సరంలో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ఎఫ్‌సీఐ కర్మాగారంలో మృతి చెందిన కార్మికులకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అధికారికంగా నివాళులర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్, ఆసిఫ్ పాషా, రమా శ్యామ్, వడ్లకొండ మహేందర్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, ఆర్ఎఫ్సీఎల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.