పాల్వంచ రూరల్/ జూలూరుపాడు/దుమ్ముగూడెం, సెప్టెంబర్ 15 : బస్తా యూరియా కోసం సాగు రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన వారు తెల్లవారుజామునే సొసైటీల వద్దకు చేరుకొని పడరాని పాట్లు పడుతున్నారు. ఆకలి దప్పులు మరిచి అరచేతిలో ఆధార్, పాస్ బుక్ ప్రతులు పట్టుకొని క్యూలో తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
కొన్ని సొసైటీల్లో రైతులకు సరిపోను యూరియా లేకపోవడంతో కూపన్లు ఇచ్చి సరిపెడుతుండగా.. మరికొన్ని కేంద్రాల్లో ఉన్న వరకు పంపిణీ చేసి మరుసటి రోజు రమ్మంటున్నారు సొసైటీ సిబ్బంది. ఏపుగా వస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు యూరియా సరైన సమయంలో వేయకపోతే ఇంత పెట్టుబడి దండగే అంటూ రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాల్వంచలో పొద్దంతా రైతుల కష్టం చూడలేక బీఆర్ఎస్ నాయకులు వారికి భోజన ఏర్పాట్లు చేశారు.
పాల్వంచ సొసైటీ కార్యాలయం వద్దకు పట్టణంతోపాటు మండలంలోని సుదూర ప్రాంతాల నుంచి రైతులు యూరియా కోసం తెల్లవారుజామునే చేరుకొని బారులుతీరారు. పురుషులతోపాటు మహిళా రైతులు గంటల కొద్దీ క్యూలో నిల్చొని అనేక ఇబ్బందులు పడ్డారు. భారీగా రైతులు చేరుకోవడంతో క్యూ భద్రాచలం జాతీయ రహదారి వరకు చేరింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులకు నచ్చజెబుతున్నా.. అదును దాటిపోతే ఎరువులు వేసి దండగ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే మధ్యాహ్నం నుంచి రైతుకు ఒక్కో బస్తా చొప్పున 210 కట్టలను సొసైటీ సిబ్బంది పంపిణీ చేశారు.
మిగిలిన రైతులకు కూపన్లు ఇచ్చి ఇంటికి పంపించారు. జగన్నాథపురం రైతు వేదిక, పాల్వంచ సొసైటీలలో మంగళవారం ఎరువులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. సొసైటీ వద్ద ఆకలితో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రంజిత్, కిరణ్, హర్షవర్ధన్, ప్రసాద్, సత్యనారాయణ, లోహిత్ సాయి తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు సొసైటీ వద్దకు సోమవారం సుమారు 500 మంది రైతులు చేరుకున్నారు. సొసైటీకి 110 బస్తాల యూరియా వచ్చిందని తెలియడంతో కట్టలు దొరుకుతాయో లేదోననే ఆందోళనతో రైతులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. సొసైటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు వచ్చి రైతులను క్యూలో నిల్చోబెట్టి కూపన్లు అందజేశారు. యూరియా అందనివారు మరుసటిరోజు వచ్చి తీసుకెళ్లాలని సూచించడంతో రైతులు ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు. దుమ్ముగూడెం మండలం నర్సాపురం సొసైటీ కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు సోమవారం ముట్టడించి ధర్నా చేపట్టారు. టోకెన్ విధానం లేకుండా ప్రతీ రైతుకు రెండు బస్తాల యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కణితి రాముడు, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, సొసైటీ డైరెక్టర్లు బొల్లి వెంకట్రావ్, కాల్వ పూర్ణయ్య, పిసోడి వెంకటేష్, కొత్త మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.