– వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్ చారి
రామగిరి, ఫిబ్రవరి 16 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువయ్యాయని, విద్యార్థుల జీవితాలతో వర్సిటీ చెలగాటమాడుతుందని యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్ చారి అన్నారు. యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ నిర్వహణ లేమిని నిరసిస్తూ మంగళవారం ఆందోళన చేశారు. పీజీ సెకండియర్( మ్యాథమెటిక్స్) విద్యార్థి కడుపు నొప్పితో జంక్షన్లో పడిపోతే కూడా, వెంటనే స్పందించాల్సిన ఏఎన్ఎం సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడం యూనివర్సిటీ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతోందన్నారు. విద్యార్థుల ఫీజుల వసూలుపై ఉన్నంత శ్రద్ధ వారి ఆరోగ్యం మీద ఎందుకు ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యూనివర్సిటీ, కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే హెల్త్ సెంటర్లో 24 గంటల వైద్య సిబ్బంది, అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని, ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృత చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్, సంపత్, అజయ్, శంకర్, సతీష్, మౌనేష్, నరసింహ పాల్గొన్నారు.