సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాలు చీకటి పడితే చాలు అసాంఘిక శక్తులు, నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా కరువవ్వడంతో విశాలమైన రహదారుల గుండా వెళ్లాలంటే వాహనదారులు, బాటసారులు కొన్ని సందర్భాలలో భయపడే పరిస్థితి నెలకొని ఉంది. ఇందులో ఉప్పల్ భగాయత్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉందంటూ ఆ రూట్లలో ప్రయాణించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి సమీపంలో భగాయత్ లే అవుట్లోని ఖాళీ స్థలాలు, ఆగిపోయిన నిర్మాణాలు, మరోపక్క చెట్లపొదలు ఉన్నాయి. అక్కడ సరిపడా వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రి అయ్యిందంటే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
మద్యం, గంజాయి సేవిస్తూ అక్కడ రాత్రి పలువురు మత్తులో తూగుతూ ఉంటారు. దానితో పాటు మరికొందరు వివిధ వేషాధారణలతో వాహనదారులను భయపెట్టిస్తున్న ఘటనలు తరుచూ నిత్యకృత్యంగా మారుతున్నాయి. రాత్రి 9గంటల తర్వాత ఆ రూట్లో వెళ్లే వాహనదారులను లక్ష్యంగా చేసుకొని వాహనాలను అడ్డగించి దాడులు చేయడం, భయపెట్టి నగదు, సెల్ఫోన్లు, ఒంటిమీద ఉండే ఆభరణాలను సైతం దోచుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ఓ ఐటీ ఉద్యోగిని వాహనాన్ని అడ్డుకున్న దుండగులు బెదిరించి అతనిని తనిఖీ చేయాలంటూ భయాందోళనకు గురిచేసినట్లు ఫిర్యాదులున్నాయి. మరో ఘటనలో గంజాయి మత్తులో మరో ముఠా వాహనదారుడిని అడ్డుకొని దాడిచేసింది. ఇటీవల కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని.. ఆకతాయిలు అడ్డుకొని భయాందోళనకు గురిచేశారు.
కొందరు వ్యక్తులు ప్రత్యేక వేషధారణల ముసుగులో ప్రధాన రహదారులు, మలుపుల వద్ద నిలబడి వెళ్లే వాహనదారులను అటకాయిస్తున్నారు. అసభ్య ప్రవర్తనతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని, భయానికి గురిచేస్తూ బెదిరింపులకు దిగి డబ్బులు లాక్కొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఆ రూట్లో వెళ్లేవారికి వీళ్లు చుక్కలు చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేషదారణల ముసుగులో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఈ వికృత చేష్టలు, బెదిరింపులకు సంబంధించి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఉప్పల్ భగాయాత్ పరిసర ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. ఇటీవల క్లస్టర్ల పేరిట క్షేత్ర స్థాయిలో నిఘాను మరింత పటిష్టం చేసే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా ఇక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆందోళన కల్గిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు చేపడుతున్న సంస్కరణలు ఉన్నతాధికారులు ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవి అమలుకాకపోవడంతో పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నది. ఇప్పటికైనా పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, సాధారణ ప్రజలు నిర్భయంగా ఈ రూట్లలో ప్రయాణించే విధంగా నిఘాను పటిష్టం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.