ముంబై: తమ ఇంటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తుల గురించి మనకు తెలుసు కానీ తమ గ్రామాన్నే అమ్మకానికి పెట్టిన గ్రామస్తుల గురించి మీకు తెలుసా? మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న తులసీ అనే గ్రామాన్ని అక్కడి గ్రామస్తులు అమ్మకానికి పెట్టారు. నీటి కొరత కారణంగా తమ గ్రామాన్ని అమ్మేస్తున్నట్టు గ్రామంలో ఒక బోర్డు వెలిసింది. దీనికి చెల్లించాల్సిన మూల్యం నీరు మాత్రమేనని ఆ బోర్డులో పేర్కొన్నారు. ఈ అన్యాయాన్ని మనం ఇంకా ఎంతకాలం భరించాలి? అంటూ గ్రామస్తులు అందులో ప్రశ్నించారు. సుమారు 7 వేల జనాభా ఉన్న ఈ గ్రామం అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు కారణంగా అనేక ఏండ్లుగా నీటి ట్యాంకర్లపైన ఆధారపడింది.
తమ గ్రామ సమీపంలో కాలువలు ఉన్నప్పటికీ తమకు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో నీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. నీటి కొరత కారణంగా గ్రామంలోని సుమారు 350 మంది యువకులు పెండ్లి చేసుకోలేకపోతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. తమ గ్రామంలోని అధిక సంఖ్యాకులు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉన్నారని ఆయన చెప్పారు. నీటి కొరత వారి జీవనోపాధితోపాటు వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలోని యువకులకు పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదని ఆయన తెలిపారు.