సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): నగరంలోని ట్రాఫిక్ ఎస్సైల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కీలక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కొందరు దుకాణాలు, ఫుట్‌పాత్ హాకర్స్ నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బదిలీలు జరిగినప్పటికీ రోజుల తరబడి పాత స్టేషన్లలోనే కొనసాగుతూ తమ దందాను అలాగే కొనసాగిస్తున్నారంటూ కమిషనరేట్‌లోని సిబ్బందిలో చర్చ జరుగుతోంది. నో ఎంట్రీలు, ట్రాఫిక్ నిబంధనలు, ఫుట్‌పాత్ ఆక్రమణల పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ట్రాఫిక్ ఎస్సైలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలున్నాయి.
గత నెలలో నగర పరిధిలోని 172మంది ఎస్ఐల బదిలీలు జరిగాయి. వీరిలో ఇప్పటివరకు సగంమందికి పైగా రిలీవ్ కాకుండా అదే పోస్టింగ్స్‌లో కొనసాగుతున్నారు. డీజీస్థాయి అధికారి ఇచ్చిన ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ కమిషనరేట్‌లో చర్చ జరుగుతోంది. గతంలో కమిషనర్ బదిలీలు చేసిన మూడురోజుల్లో ఎక్కడివారు అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేసేవారు. ఒకవేళ ఎస్హెచ్ఓ సదరు ఎస్ఐని రిలీవ్ చేయకపోతే ఆ అధికారికి చార్జ్‌మెమో ఇచ్చే పరిస్థితి ఉండేది. అప్పట్లో పోస్టింగ్ రావడం చాలా కష్టంగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టింగులు వచ్చినా చాలామంది తమ స్టేషన్ల నుంచి రిలీవ్ కాకుండా కొత్త పోస్టింగుల్లోకి వెళ్లకుండా పాతచోటనే తమ పై అధికారుల వ్యవహారాలు చక్కబెడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలోని జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని ఒక ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐపై గతంలో భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అతనిని సెలవుపై పంపించారు. కొన్నిరోజుల తర్వాత తిరిగి అదే స్టేషన్‌కు వచ్చి విధులు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన బదిలీలలో అతనికి సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఒక పీఎస్‌కు బదిలీ కాగా అతను చాలారోజుల వరకు రిలీవ్ కాకుండా అక్కడే విధులు నిర్వర్తిస్తూ భారీస్థాయిలో మామూళ్లు వసూలు చేశారంటూ అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది చెప్పారు. తమ పరిధిలో ఉన్న వ్యాపారులకు ఈ బదిలీల విషయం తెలియకపోవడంతో అతని ఆగడాలకు అంతేలేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. చార్మినార్ జోన్‌లోని ఒక పీఎస్‌లో పనిచేసిన ఎస్ఐకి గోల్కొండ జోన్‌లోని పీఎస్‌కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా రిలీవ్ కాకుండా అదే స్టేషన్లో విధులు నిర్వర్తించడమే కాకుండా ఒక వివాహేతర సంబంధం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొని స్టేషన్ వద్దే గొడవకు మూలమయ్యారు. వీరిద్దరి వ్యవహారమే కాకుండా నగరంలోని పలు ట్రాఫిక్ పీఎస్‌లలో బదిలీ అయినా రిలీవ్ కాకుండా ఉండటం, హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసిన వారిని ఇంకా అదే పీఎస్‌లలో సిబ్బంది లేరంటూ కొనసాగించడం వెనక చాలా మతలబు ఉందంటూ కమిషనరేట్ సిబ్బంది .
సిటీ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ 1, ట్రాఫిక్ డీసీపీ 2, ట్రాఫిక్ డీసీపీ పరిధిలోని కొన్ని ప్రధాన ప్రాంతాలకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న కొంతమంది ఎస్సైల వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. తమ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థలను, ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నెలవారీవసూళ్లు చేస్తున్నారని పోలీసులే చర్చించుకుంటున్నారు. వ్యాపారం ఎక్కువగా జరిగేచోట ఒక్క రేటు, సాధారణ వ్యాపారాలకు మరో రేటు నిర్ణయించి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వ్యాపారులు సహకరించకపోతే ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో వారిని వేధిస్తున్నట్లుగా పలువురు వ్యాపారస్తులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాక్షాత్తు తాము పెద్దసార్ మనుషులమంటూ కూడా కొందరు ఎస్ఐలు స్థానికంగా జులుం చెలాయిస్తున్నారని, ఎవరైనా తమ పై అధికారి ఈ అవినీతిపై ప్రశ్నిస్తే పట్టించుకోకుండా సార్‌తోనే మాట్లాడుకోమంటున్నారంటూ కొందరు అధికారులు వాపోయారు. నగరంలోని కొన్ని వాణిజ్యసముదాయాలకు సంబంధించిన ఫోకల్ ట్రాఫిక్ పీఎస్‌లలో పనిచేస్తున్న ఎస్ఐల నెలవారీ మామూళ్లు కొన్నిచోట్ల రూ.2లక్షల-రూ.5లక్షలకు పైగానే ఉంటుందంటూ సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు.