సిటీబ్యూరో, జూలై 26(నమస్తే తెలంగాణ) : నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న హైదరాబాద్ మెట్రోలో రద్దీని తగ్గించేందుకు కొత్త బోగీల కొనుగోలు వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చిన హెచ్ఎంఆర్ఎల్.. ఇప్పుడు వాటికి అయ్యే ఖర్చు విషయంలో దిక్కులు చూస్తున్నది. నిధుల చిక్కుముడి వీడక వేచిచూసే ధోరణిలో పడి, నగరంలో మెట్రో రైళ్లలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌ల తయారీ, సరఫరా కోసం అధికారులు అడుగులు వేస్తున్నప్పటికీ, చెల్లింపుల అంశం వద్దే ప్రక్రియ నిలిచిపోయింది. రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు బెంగుళూరుకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌తో మెట్రో ప్రతినిధులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. అయితే మెట్రో బోగీల తయారీకి కనీసం 15 నెలల వ్యవధి పడుతుందని, ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరి, నిధులు జమ అయిన తర్వాతే ఆర్డర్ ఖరారవుతుందని, ఆర్డర్ ఇచ్చిన నాటి నుంచి తయారీకి 15నెలల సమయం పడుతుందని, బీఈఎంఎల్ ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు బోగీలకు ఆర్డర్ పెట్టిన.. పట్టాలెక్కేందుకు కనీసం 20నెలలు పడుతుందనే అంచనాలు ఉన్నాయి.
కొత్త బోగీల తయారీకి భారీగా నిధులు సమకూర్చాల్సి ఉండటంతో.. ఈ వ్యయం ఇప్పుడు ఎవరూ భరించాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఎందుకంటే సర్కారు ఇచ్చే స్థాయిలో ఆర్థికంగా బలంగా లేదు. ఇక హెచ్ఎంఆర్ఎల్కు మెట్రో పేరిట ఇప్పటికీ కూడబెట్టిన నిధులు లేవు. దీంతో కొత్త బోగీలు కొనడానికి మళ్లీ లోన్లకు వెళ్లిన.. ఇప్పటికిప్పుడు అప్పు పుట్టే పరిస్థితి లేని స్థాయిలో మెట్రో ఆదాయ, వ్యయాలు ఉన్నాయి. ఒకవేళ ఎల్అండ్టీ సంస్థ ముందుకు వచ్చి నిర్వహణ ఒప్పందాలు, ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో కొత్త బోగీలకు నిధులు సమకూర్చినా.. వాటి చెల్లింపులు, వడ్డీల భారంతో వెనుకడుగు వేస్తోంది.
ప్రస్తుతం మెట్రోలో మూడు బోగీలతో సర్వీసులు నడుస్తున్నాయి. పీక్ అవర్స్‌లో వీటిలో గరిష్ఠంగా 1100 మందికి మించి ప్రయాణించలేని పరిస్థితి. ఈ క్రమంలో అదనంగా మూడు బోగీలను పెంచితే ప్రయాణికుల సంఖ్య రెండింతలై… పీక్ అవర్స్ సౌకర్యవంతంగా ఉంటుందని కొత్త బోగీల ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ వీటిని కొనుగోలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా.. కనీసం వాటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా చేసుకోలేదు. చివరకు ఆరు బోగీలతో కూడిన సర్వీసులను పెంచితే కలిగే ప్రయోజనాలను కూడా సర్కారు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి.