Suryapet | సూర్యాపేట: పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు యర్కారం సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట తడి పెట్టించేందుకే అప్రకటిత కరెంటు కోతలను విధిస్తుందని అన్నారు. రైతులు ధాన్యం పండిస్తే ఎక్కడ కొనాల్సి వస్తుందో అని నీళ్లు ఇవ్వకుండా కనీసం బోరుబావుల కింద ఉన్న పంట సాగు చేసుకుందామంటే కరెంటు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు, సాగునీరు ఇచ్చిందని ఈ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. అప్రకటిత కరెంటు కోతలు విధించడంతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని రోజుల తరబడి మెకానిక్ ల వద్ద వేచి చూడాల్సి వస్తుందన్నారు. పొలాల వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను బాగు చేయించుకోవాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు కోసం సూర్యాపేటలో రోడ్డెక్కిన రైతన్నలు! ⚡🔥
“రైతు వ్యతిరేకి రేవంత్ డౌన్.. డౌన్!” అంటూ నినాదాలు 🚨
⚡ వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను సకాలంలో అందించాలని రైతుల రాస్తారోకో!
📍 ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రోడ్డుపై బైఠాయించిన రైతాంగం.
👉 కేసీఆర్ హయాంలో ఇచ్చిన 24 గంటల… pic.twitter.com/OFvCQ0DQFd
— BRS Party (@BRSparty) September 12, 2026
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పదెకరాలు సాగు చేసే రైతు.. కేవలం తిండి గింజల మందం ఎకరం ఆరెకరం మాత్రమే సాగు చేశాడని ఆయన తెలిపారు. ఆ ఎకరం అర ఎకరం కూడా సాగు కాకుండా పెట్టిన పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా కరెంటు కోతలతో ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సూర్యాపేట జిల్లాకు కరెంటు ఎంత అవసరం పడుతుందో అంతమేర సరఫరా చేయాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించినట్లు 24 గంటలు కాకున్నా కనీసం రైతులకు 12 గంటల నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ ను అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పంటలు ఎండితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

రైతులు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ ముట్టడించి రాస్తారోకో చేయడంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు కలగచేసుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింప చేశారు.