అహల్యానగర్, జూలై 26: ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా చర్చలు, ప్రజాస్వామ్య విధానాల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలి తప్ప నియంతృత్వ నిర్ణయాల ద్వారానో, బలవంతం మీదనో కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహల్యానగర్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఇది ప్రజాస్వామ్యం, ఏకపక్ష ఆదేశాలతో పాలించే వ్యవస్థ కాదు. ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరించాల్సిందే’ అని హజారే అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసి విద్యా శాఖ మంత్రితో రాజీనామా చేయంచిన సీజేపీ విధానాన్ని స్వాగతించిన ఆయన ఇరు వర్గాలు కూడా శాంతియుత విధానాలకు కట్టుబడి ఉండాలన్నారు. శాశ్వతమైన మార్పు ఘర్షణల ద్వారా కాకుండా చర్చల ద్వారా మాత్రమే వస్తుందన్నారు. పౌరులు, సంస్థలు తమ డిమాండ్ల సాధనకు అహింసా మార్గాన్నే అనుసరించాలని ఆయన కోరారు.