Nandigram : పశ్చిమ బెంగాల్లో నందిగ్రాం అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. జైలులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలాన్ ప్రధాన్‌కు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిలాన్ తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం లభించనుంది. జస్టిస్ తీర్థాంకర్ ఘోష్ ఆధ్వర్యంలోని బెంచ్ ఆయనకు రూ.20,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి.
2007లో నందిగ్రామ్‌లో జరిగిన అల్లర్ల ఘటనపై మిలాన్ ప్రధాన్‌పై కేసు నమోదైంది. చాలా కాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా నందిగ్రామ్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే అక్టోబర్ 6న ఈ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మిలాన్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ దాఖలు చేసిన రోజే ప్రధాన్‌ను 2007 నాటి నందిగ్రామ్ అల్లర్ల కేసులో అరెస్టు చేశారు. దీంతో ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాన్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ జరిపిన కోర్టు కీలక అంశాల్ని ప్రస్తావించింది. ఈ కేసు నామినేషన్ వేసిన సమయంలో దాఖలు కాలేదని కోర్టు గుర్తించింది. నామినేషన్‌ను దాఖలు చేసిన తర్వాత పాత కేసును మళ్లీ తిరిగి ఓపెన్ చేసి, ఆయనను అరెస్టు చేశారని కోర్టు అభిప్రాయపడింది. చాలా కాలం నాటి కేసు కాబట్టి, ఈ ఎన్నికల్లో అతడు ప్రచారం చేయకుండా అడ్డుకోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.
దీంతో ప్రధాన్‌కు కోల్‌కతా హైకోర్టు అక్టోబర్ 21 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిజానికి అతడికి అక్టోబర్ 7 వరకు గతంలో కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, ఇప్పుడు బెయిల్ రావడంతో అతడు ఇకపై ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ 4 వరకు ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది.