మిర్యాలగూడ, సెప్టెంబర్ 29 : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హత ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు కోరారు. తాను కూడా నేడు తన ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అర్హత కలిగిన పట్టభద్రులు ఎలాంటి ఆలస్యం చేయకుండా పట్టభద్రుల ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భాస్కర్ రావు సూచించారు. “నేను ఈరోజే నా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నాను. మీరు కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఓటును నమోదు చేసుకోండి” అని ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు.