FD rules : బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) చేసే పెద్ద మొత్తపు డిపాజిటర్ల కోసం ఆర్బీఐ కొత్త నిబంధనల (RBI New Rules) ను తీసుకొచ్చింది. ఈ మార్పులు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల (Interest rates) లో మరింత పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యమని తెలుస్తున్నది. ముఖ్యంగా రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన టర్మ్ డిపాజిట్ల (Term deposits) ను ‘బల్క్ డిపాజిట్లు (Bulk deposits)’ గా పరిగణిస్తారు. ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా ఇలాంటి పెద్ద డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి.
వచ్చే నెల 1 నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు సహా నిర్దేశిత ఆర్థిక సంస్థలన్నీ తమ బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ప్రతి పనిదినం ఉదయం 10 గంటలలోపు అధికారిక వెబ్సైట్లలో ప్రచురించాలి. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే అందుకు 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వెబ్సైట్లో ప్రకటించిన వడ్డీ రేటునే ఆ రోజు డిపాజిట్ చేసే కస్టమర్లకు తప్పనిసరిగా చెల్లించాలి. దీనివల్ల రేట్ల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావుండదు. ఇప్పటివరకు ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచ్‌లలో ఒకే రకమైన బల్క్ డిపాజిట్‌కు స్వల్పంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇచ్చే అవకాశం ఉండేది.
అయితే తాజా నిబంధనలతో ఆ పద్ధతికి తెరపడింది. కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై ఒకేరోజు ఒకే బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే రకమైన డిపాజిట్‌కు ఒకే వడ్డీ రేటును అందించాల్సి ఉంటుంది. ఇది బ్రాంచ్‌ల మధ్య వివక్షను తొలగించి, డిపాజిటర్లకు ఏకరూపతను అందిస్తుంది. ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్యతరగతి రిటైల్ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. ఈ మార్పులు కేవలం రూ.3 కోట్లు, ఆపైన చేసే బల్క్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ ఎఫ్డీ కస్టమర్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి.
ఇప్పటికే చేసిన పాత ఎఫ్డీలపై వాటి కాలపరిమితి ముగిసే వరకు ఒప్పందం ప్రకారం పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఈ నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులకు వర్తిస్తాయి.