ఇల్లెందు, ఫిబ్రవరి 16 : ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయం ఒక కొలిక్కి రాకపోవడం, గెలిచిన కౌన్సిలర్లు సమయానికి హాజరు కాకపోవడంతో ఎన్నికల అధికారి, కొత్తగూడెం ఆర్డీఓ మధు నూతన పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. మున్సిపల్ నూతన పాలక మండలి ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, ఆర్డీఓ మధు తెలిపారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ కోసం గెలిసిన అభ్యర్థుల్లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నేతలు సభ్యులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి రాకనే తొలి రోజు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదని స్థానిక నేతలు వెల్లడించారు.