నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అంగన్వాడీ టీచర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, ఎఫ్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పీఎం విద్యను అంగన్వాడీ కేంద్రాలకు అందించాలని, మూడు నెలల పీఆర్సీని, 11 నెలల ఇయర్ రిటైర్మెంట్, 10 నెలల సీబీఈ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు హెచ్చరించారు.