Serial deaths : బంధువు అంత్యక్రియల (Last rites) కు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదం (Road accident) లో నలుగురు దర్మరణం పాలయ్యారు. వారి అంత్యక్రియలకు వెళ్లి, అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ (Rajastan) రాష్ట్రంలో గత శనివారం నుంచి ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్‌కు చెందిన ఓ వ్యక్తి శనివారం కారు ప్రమాదంలో మరణించాడు. కారు అదుపుతప్పి 16 అడుగుల లోతైన లోయలో పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో రెండు కుటుంబాలకు చెందిన ఆయన ఏడుగురు బంధువులు కారులో అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియల అనంతరం శనివారం రాత్రి వారు తిరుగు ప్రయాణమయ్యారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని రింగు రోడ్డు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి నీటితో నిండిన అండర్‌పాస్‌లో పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని స్థానికులు రక్షించారు. ఆదివారం ఆ నలుగురి అంత్యక్రియలు బిల్వారా జిల్లాలోని వారి స్వగ్రామం ఫులియా కాలాలో జరిగాయి. అంత్యక్రియలకు వెళ్లిన వారిలో ఏడుగురు బంధువులు పక్కనున్న ఖారీ నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు.
అక్కడున్న మిగతా బంధువులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగతా నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.