RGV | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న సినిమాల్లో ఒకటి ధురందర్ 2: ది రివెంజ్. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ధురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఆ విజయంతో ఇప్పుడు రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1500 నుంచి రూ.2000 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే అది సౌత్ సినిమాలకు పెద్ద సవాల్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఎక్కువగా పాత శైలిలోనే యాక్షన్ సన్నివేశాలు చూపిస్తున్నారని, అయితే దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం యాక్షన్ ప్రెజెంటేషన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లారని వర్మ తెలిపారు. గాల్లో ఎగిరే ఫైట్లు కాకుండా రియలిస్టిక్ యాక్షన్‌ను చూపించడం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఈ సినిమాను కూడా బాహుబలి తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించడం ఆసక్తికర అంశమని వర్మ పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలో కూడా విస్తృతంగా ప్రమోషన్స్ జరుపుకుంటోందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన వర్మ, దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరును ప్రశంసించారు. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ కూడా ఎదురుకానుంది. మొదట్లో రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ చిత్రంతో పోటీ పడాల్సి ఉన్నప్పటికీ ఆ సినిమా వాయిదా పడటంతో పోటీ తగ్గిందని భావించారు. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అదే రోజు విడుదలకు సిద్ధమవడంతో బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో ఒకవైపు బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’, మరోవైపు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతుందో అనే చర్చలు ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.